- మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఘటన
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లీ, బిడ్డ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ప్రభుత్వాసుపత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు సకాలంలో డాక్టర్లు వైద్యం అందించకపోవడంతో పండంటి బిడ్డకు కష్టం మీద జన్మనిచ్చి ఆ వెంటనే ఆమె ఆసుపత్రిలో కన్ను మూసింది. తల్లి చనిపోయిన మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే పురిటి బిడ్డ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై వివరాలు.. గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన నజీర్ బాషా భార్య ఎస్.రుక్సాన(25), మూడవ కాన్పు ప్రసవ నొప్పులు రావడంతో ఆమె పుట్టినిల్లు అయిన మదనపల్లి మండలం సిటిఎం రోడ్డులో ఉన్న ఆరోగ్య వరం తురకపల్లికు వచ్చింది. నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం తెల్లవారి తీసుకొచ్చి మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మేటర్నిటీ వార్డులో చేర్పించారు. ఆ సమయంలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో అడ్మిట్ అయిన కొంత సేపటికి అతి కష్టం మీద పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మరికొంత సేపట్లోనే ఆమె మృత్యువాత పడింది. బాలింత రుక్సానా చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే ఆమెకు పుట్టిన పండంటి మగ బిడ్డ కూడా కన్నుమూశాడు. తల్లీ, బిడ్డ ఆస్పత్రిలో మృత్యువాత పడడంతో మృతురాలి కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయమై వైద్యులను వివరణ కోరగా 160/110 బిసితో గర్భిణి ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని చెప్పారు. రిస్కు ఉంటుందని చెప్పే ప్రసవం చేశామని, బాధగా ఉందని డాక్టర్లు తెలిపారు. బాధితులు ఆరోపిస్తున్నట్లు తమ నిర్లక్ష్యం లేదని వారు చెప్పారు.










