Nov 14,2023 13:58

కొచ్చి : కేరళలోని అలువలో జరిగిన చిన్నారి కిడ్నాప్‌, అత్యాచారం కేసులో నిందితుడు అష్‌ఫక్‌ ఆలమ్‌కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మంగళవారం (నవంబర్‌ 14) మరణశిక్షను విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ వాదనల అనంతరం జడ్జి కే సోమన్‌ ఈరోజు తీర్పును వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సోమన్‌ ఈ కేసు గురించి మాట్లాడుతూ.. 'ప్రాసిక్యూషన్‌ చేసిన వాదనలను కోర్టు అంగీకరించింది. ఇది అత్యంత అరుదైన కేసు. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి క్షమాపణ అవసరం లేదు. ఇలాంటి నిందితుడు సమాజానికే సమస్య.' అని అన్నారు. దాదాపు 110 రోజుల పాటు ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం బాలల దినోత్సవం రోజునే తీర్పు వెలువడడం గమనార్హం.
ఈ కేసులో నిందితుడు అష్‌ఫక్‌ ఆధారాలు ధ్వంసం చేసినందుకు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే మైనర్‌కు డ్రగ్స్‌ ఇచ్చినందుకు మూడేళ్ల శిక్ష, మైనర్‌ను రేప్‌ చేసినందుకు జీవితకాల జైలుశిక్ష, మర్డర్‌ చేసినందుకు మరణశిక్షను విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. ఈ కేసులో 7,70,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బాలల దినోత్సవం రోజు తీర్పు.. పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక: విజయన్‌
తిరువనంతపురం అలువాలో బాలిక హత్య కేసులో కోర్టు ప్రకటించిన తీర్పు నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే దారుణమైన క్రూరత్వానికి చిన్నారి బలి అయ్యిందని, బాలల దినోత్సవం రోజునే వచ్చిన ఈ తీర్పు చిన్నారులను అఘాయిత్యాలకు బలిపశువులను చేసే వారికి గట్టి హెచ్చరిక అని ముఖ్యమంత్రి అన్నారు. సమగ్ర విచారణ ద్వారా దోషికి గరిష్టంగా శిక్ష పడేలా చేసిన దర్యాప్తు బృందాన్ని, ప్రాసిక్యూషన్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
దారుణానికి గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయం, రక్షణ కల్పిస్తుంది. వారికి జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయదు. అయితే కోర్టు తీర్పుతో న్యాయం జరిగింది. నాగరిక సమాజంలో పిల్లలపై ఎలాంటి హింసాకాండ ఆమోదయోగ్యం కాదు. అలాంటి వారిపై కనికరం లేకుండా చర్యలు తీసుకుంటామని విజయన్‌ అన్నారు. ఇలాంటి అమానవీయ నేరాలకు పాల్పడే వారికి ఈ కోర్టు తీర్పు గట్టి హెచ్చరిక కూడా. ఇలాంటి నేరస్తులను ఏకాకిని చేసేందుకు సమాజం అంతా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అన్నారు.