Aug 16,2020 07:53


కోటి అక్షరాలు చెప్పలేని భావాన్ని...ఓ చిత్రం చెబుతుంది. అది-అనుభూతులను పంచే అందమైన దృశ్యమైనా, జ్ఞాపకాలను మిగిల్చే అరుదైన చిత్రమైనా, హృదయాన్ని రగిలించి, కదిపి కుదిపే ఘటనైనా.. మనసుపై చెరగని ముద్ర వేస్తుంది. అలాంటి వెలకట్టలేని దశ్యాలను పదికాలాల పాటు మన కళ్ల ముందు నిలుపుతుంది ఫొటో. జీవితంలోని ముఖ్య సంఘటనలను కెమెరాలో బంధించి, జీవితపర్యంతం ఆ జ్ఞాపకాలను తనివితీరా చూసుకొని ఆస్వాదింపజేసే తీయని జ్ఞాపకం ఫొటో. ఒక మాట వింటే కొన్నాళ్లకు మర్చిపోతాం. ఒక పదం చదివితే ఇంకొన్నాళ్లకు మరుగున పడిపోతుంది. కానీ, ఒక ఫొటో చూస్తే... అది మనోఫలకంపై ముద్రితమవుతుంది. ప్రతి ఫొటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ భయోత్పాతం, ఓ అనుభూతి.. ఏదో ఒకటి దాగివుంటాయి. మానవ జీవితంలోని కొన్ని సన్నివేశాలను, సంఘటనలను బంధించి చూపించేది, అందమైన భావానికి దృశ్య రూపమిచ్చేది, మాటలకందని భావాలను ఫొటో రూపంలో బంధించేది ఫొటోగ్రఫీ. ఈ ప్రావీణ్యత వెనుక గొప్ప కళాత్మక సైన్స్‌ దాగివుంది. దీనిలోని అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకే 'ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం' నిర్వహించబడుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్‌ డాగ్యురే ఆవిష్కరణల నుండి అభివృద్ధి చేసిన ఫొటోగ్రఫీ ప్రక్రియ గురించి జనవరి 9, 1839న ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ప్రకటించింది. అదే ఏడాది ఆగస్టు 19న ఈ ఆవిష్కరణను ప్రపంచానికి అందించింది.
డబ్బా కెమెరాల నుంచి మొదలైన కెమెరా ప్రస్థానం... డిజిటల్‌ కెమెరాలు, మొబైల్‌ కెమెరాల వరకూ కొనసాగుతూనే వుంది. ఈ క్రమంలో సరదాలు, సంతోషాలకే కాకుండా ప్రపంచాన్ని మలుపు తిప్పిన ఎన్నో సంఘటనలకు ఫొటోగ్రఫీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ప్రపంచాన్ని కదిలించిన ఎన్నో ఘటనలకు కారణమైంది. సిరియాకు చెందిన మూడేళ్ల బాలుడు అయ్లాన్‌ కుర్ది సముద్రంలో మునిగి చనిపోయి, ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఘటన ఫొటో ప్రపంచాన్ని కుదిపేసింది. కన్నీళ్లు పెట్టించింది. అలాగే, ట్రంప్‌ కాటుకి విలవిల్లాడిన చిన్నారి ఫొటో ఒకటి వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో అవార్డుకు ఎంపికైంది. అమెరికా-మెక్సికో సరిహద్దు దగ్గర సోదా చేసేందుకు తల్లి నుంచి పిల్లను వేరుచేసినపుడు, ఆ పిల్ల కళ్లలో, ముఖంలో భయం, ఆందోళన తారట్లాడటం నాకు కనిపించింది, దాన్నే ప్రపంచానికి చూపించానని ఆ ఫొటో తీసిన జాన్‌మూర్‌ తన అనుభవాన్ని చెప్పుకున్నాడు. వియత్నాంపై అమెరికా చేస్తోన్న యుద్ధానికి వ్యతిరేకంగా 'మీరు పట్టుకోవాల్సింది గన్‌లు కాదు పూలు' అంటూ ఓ మహిళ అమెరికా సైనికులకు వినూత్న నిరసన తెలిపింది. ఈ చిత్రం తర్వాత రోజుల్లో 'ఫ్లవర్‌ పవర్‌' మూవ్‌మెంట్‌కు చిహ్నంగా మారింది. భోపాల్‌ గ్యాస్‌ ప్రమాదంలో చనిపోయిన తన కొడుకు దేహాన్ని తండ్రి పూడ్చిపెడుతోన్న దృశ్యం.. ఆ దుర్ఘటనకు సజీవ సాక్ష్యం. ఈ ఫొటో ఇంకా ప్రజల స్మృతిపథం నుండి చెరిగిపోనేలేదు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో విద్యుత్‌ పోరాట యోధులపై అప్పటి ప్రభుత్వం కురిపించిన బులెట్లు, నేలకొరిగిన యోధుల ఫొటోలు నేటికీ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమే. కరోనా కాలంలో వలస కార్మికుల రోదనను, వేదనను ఆవిష్కరించిన జీవన చిత్రాలు, హదయాన్ని మెలిపెట్టే వేదనాభరిత చిత్రాలు ఎన్నెన్నో మన కళ్లముందు కదలాడతాయి. మహరాష్ట్ర రైతులు సాగించిన మహా పాదయాత్రలో... నెర్రలిచ్చిన రైతుల పాద ముద్రల ఫొటోలు కళ్లను చెమరింపజేస్తాయి. ఇలాంటి ఎన్నో యదార్థ సంఘటనలకు ప్రత్యక్షసాక్షి ఫొటోగ్రఫీ.
కదిలే కాలంలో జరిగే సంఘటనల తాలూకు చెదరని మధుర స్మతులకు ప్రతిబింబాలు ఫొటోలు. ఫొటోగ్రఫీ ఒక సృజనాత్మక ఆయుధం. దాన్ని ఎటునుంచి ఎటైనా ఉపయోగించుకోవచ్చు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటికాలంలో లిప్తకాలంలో వందల సంఖ్యలో ఫొటోలను తీయగల కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రజాపక్షం వహించాలి. ప్రజా సమస్యలను దశ్యమాలికలుగా ప్రపంచం ముందు ఆవిష్కరించాలి. అటువంటి ఫొటోగ్రాఫర్ల సృజనాత్మకతకు, స్ఫూర్తికి ఈ 'ప్రపంచ ఫొటోగ్రఫీ' దినోత్సవం ఒక ఊతం కావాలి.