Jul 01,2021 07:02

యాభై మందితో 1921లో ఏర్పాటైన చైనా కమ్యూనిస్టు పార్టీ నేడు 9.5 కోట్ల మందితో ప్రపంచంలో అతి పెద్ద కమ్యూనిస్టు పార్టీగా విస్తరించడమే గాక, చైనాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో మేటిగా నిలిపింది. ఇరవై ఒకటో శతాబ్దంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నిర్మాణం పట్ల అది తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నది. చైనా కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా మొదటి మహాసభ నుంచి నేటివరకు సాగించిన ప్రస్థానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు.

1921
మొదటి సిపిసి జాతీయ మహాసభ

చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సందర్భంగా జరిగినది.

1922
రెండవ మహాసభ

తొలి సిపిసి కార్యక్రమం
సామ్రాజ్యవాదానికి, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా చైనా ప్రజాతంత్ర విప్లవ సాధనకు పథ నిర్దేశం.

1923
మూడవ మహాసభ

కొమింటాంగ్‌- కమ్యూనిస్టుల సహకారం ప్రాతిపదికన యునైటెడ్‌ రివల్యూషనరీ ఫ్రంట్‌ ఏర్పాటు.

1925
నాలుగో మహాసభ

విప్లవంలో కార్మికవర్గానిదే నాయకత్వ పాత్ర. కార్మికులు, కర్షకులు ఐక్య కూటమిగా ఏర్పడాలి.

1927
అయిదో మహాసభ

మాస్కోలో జరిగింది.
వ్యవసాయక విప్లవం, గ్రామీణ విప్లవ ప్రజాతంత్ర అధికారం ఏర్పాటు ప్రధాన కర్తవ్యాలుగా నిర్దేశించుకుంది.

1928
ఆరవ మహాసభ

మాస్కోలో జరిగింది.
మొదటి మహా విప్లవం వైఫల్యం నుంచి తీసుకోవాల్సిన పాఠాల గురించి వివరించడం జరిగింది.

1945
ఏడవ మహాసభ

మావో జెడుంగ్‌ ఆలోచనా విధానం మార్గదర్శకంగా తీసుకుని పనిచేయడం, పార్టీ రాజ్యాంగంలో దీనిని రాసుకోవడం జరిగింది.

1956
ఎనిమిదో మహాసభ

సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి పరివర్తనను పార్టీ కీలక కర్తవ్యాలలో ఒకటిగా పేర్కొనడం జరిగింది.

1969
తొమ్మిదో మహాసభ

సాంస్కృతిక విప్లవ సిద్ధాంతం, ఆచరణకు చట్టబద్ధత కల్పించడం. పార్టీ కేంద్ర కమిటీలో లిన్‌ బియావో, జియాంగ్‌ కింగ్‌ స్థానాలను పటిష్టపరచుకోవడం. సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ పరమైన మార్గదర్శకాలు పూర్తిగా వక్రీకరించడం జరిగింది.

1973
పదవ మహాసభ

మునుపటి మహాసభ చేసిన తప్పిదాలను కొనసాగించడం,
విప్లవ సిద్ధాంతాన్ని తప్పుగా అన్వయించడం ఈ మహాసభలోనూ కొనసాగింది

1977
పదకొండవ మహాసభ

సాంస్కృతిక విప్లవం అంతమొందినట్లు ప్రకటించింది. అయితే వామపక్ష అనుకూల సిద్ధాంతాలు, విధానాలు, నినాదాలను సరిదిద్దడంలో అది విఫలమైంది.

1978
పదకొండవ మహాసభ మూడవ ప్లీనరీ సమావేశం

విశాల దృష్టితో ఆలోచించడం, వాస్తవాల ఆధారంగా సత్యాన్ని నిర్ధారించడం, సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను తెరవడం, డెంగ్‌ సియావోపింగ్‌ కేంద్రంగా పార్టీ కీలక నాయకత్వం ఏర్పాటు కావడం.

1982
పన్నెండవ మహాసభ

చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నిర్మాణం అన్న భావనను ముందుకు తెచ్చింది.

1987
పదమూడవ మహాసభ

సోషలిజం ప్రాథమిక దశలో ఉన్నాం అన్న థియరీని వివరించడం. ఆర్థిక నిర్మాణానికి ప్రాథమిక ప్రాతిపదికను రూపొందించడం పార్టీ కేంద్ర కర్తవ్యంగా నిర్దేశించడం, నాలుగు కీలక సూత్రాలకు పార్టీ కట్టుబడి ఉండడం, సంస్కరణలు, తలుపులు తెరిచే విధానానికి బద్ధురాలై ఉండడం.

1992
పద్నాల్గవ మహాసభ

ఆర్థిక సంస్కరణల లక్ష్యం: సోషల్‌ మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు.డెంగ్‌సియావోపింగ్‌ సిద్ధాంతం మార్గదర్శకంగా చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నిర్మాణానికి కట్టుబడి ఉండడం.

1997
పదిహేనవ మహాసభ

డెంగ్‌ సియావో పింగ్‌ థియరీని పార్టీ మార్గదర్శకంగా తీసుకోవాలని సిపిసి రాజ్యాంగంలో లిఖించుకోవాలని నిర్ణయించుకుంది.

2002
పదహారవ మహాసభ

2020 కల్లా ఒక మోస్తరు సుసంపన్న మైన సమాజాన్ని సాధించాలని తీర్మానించింది.

2007
పదిహేడవ మహాసభ

శాస్త్రీయ దృష్టితో అభివృద్ధి అంచనా. సాంఘిక సామరస్యతతో కూడిన సమాజం ఏర్పాటు గురించి సిపిసి రాజ్యాంగంలో పేర్కొనాలని నిర్ణయించింది.

2012
పద్దెనిమిదో మహాసభ

శాస్త్రీయ దృక్పథంతో కూడిన అభివృద్ధి పార్టీకి మార్గదర్శకంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఒక మాదిరి సంపన్న సమాజాన్ని సాధించాలి. ఆర్థిక సంస్కరణలు లోతుగా చేపట్టడం, ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా తెరచి వుంచాలని తీర్మానించింది.

2017
పందొమ్మిదో మహాసభ

నూతన శకంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నిర్మాణం సీ జిన్‌పింగ్‌ ఆలోచనావిధానం పై జరగాలని సిపిసి రాజ్యాంగంలో రాసుకోవడం. 21వ శతాబ్దం మధ్య భాగం వరకు చైనా అభివృద్ధికి సంబంధించి నిర్దిష్ట కాల ప్రణాళిక, రోడ్డు మ్యాప్‌కు రూపకల్పన చేసింది.

సిపిసి మొదటి మహా సభ నుంచి నేటి వరకు