ప్రజాశక్తి - పెనుకొండ : పట్టణంలోని కియా అనుబంధ సంస్థ ఏ సి టి ప్లాస్టిక్ పెయింట్స్ కంపెనీ లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగిపై లైంగిక వేధింపులు గురిచేస్తున్న హెచ్ ఆర్ కరుణాకరన్ ,విజరు కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలని, తొలగించిన మహిళా ఉద్యోగిని విధులకు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగిని ఏ కారణం లేకుండా హెచ్‌ఆర్ కరుణాకరన్ ప్రతిరోజు లైంగిక వేధింపులు గురిచేశాడని విమర్శించారు. చిన్న కారణంతో కంపెనీ నుండి గత మూడు రోజులు క్రితం మహిళా ఉద్యోగిని పనిలో నుంచి తొలగించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కంపెనీకి సంబంధించిన హెచ్‌ఆర్ కరుణాకరన్ ,విజరు కుమార్ దురుసుగా ప్రవర్తించారని అన్నారు. దీంతో బాధితులు తమను ఆశ్రయించారని ఇప్పటికైనా సంబంధిత యాజమాన్యం స్పందించి ఆమెను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కంపెనీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళ ఉద్యోగి ఉష, లక్ష్మీదేవి,సిఐటియు మండల నాయకులు వజ్రం నాగప్ప, మూర్తి ,శ్రీరాములు, ముత్యాలు ,అంజి ,అన్నప్ప తదితరులు పాల్గొన్నారు.










