ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్
కష్ణా యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న సెకండ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కష్ణా యూనివర్సిటీ దగ్గర ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కష్ణా జిల్లా కార్యదర్శి పి.పవన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ కష్ణా యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ సిలబస్ పూర్తికాకుండా సెమిస్టర్ నిబంధనల ప్రకారం 90 రోజులు కూడా పూర్తి కాకుండా పరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. యూనివర్సిటీ చేస్తున్న నిర్వాకం వల్లే విద్యార్థులకు ఈపరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవులను కూడా పని దినాలుగా లెక్కించడం సరైనది కాదని తెలిపారు. దీనితో పాటు సకాలంలో పరీక్ష ఫలితాలు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. బాగా చదివే విద్యార్థులను కూడా కావాలని ఫెయిల్ చేయటం జరుగుతుందని, ఇటువంటి చర్యలను నిరోధించాలని కోరారు. మూడు నెలలు గడవక మునుపే రెండవ సెమిస్టర్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల ఏ యూనివర్సిటీలో లేదని తెలిపారు. ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దుచేసి పరీక్షలు వాయిదా వేయలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వెంటనే స్పందించి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులు భవిష్యత్తు కాపాడాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పరీక్ష షెడ్యూలు రద్దు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు కలుపుకొని యూనివర్సిటీ దగ్గర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కె.బి.చంద్రశేఖర్ కు అర్జీ అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ కార్యదర్శి గోపి నాయక్ మచిలీపట్నం నాయకులు కవిత, సాయి, కీర్తి, అక్షరు, బసీమ్, ప్రదీప్, జెఫన్యా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులు పాల్గొన్నారు.










