ప్రధాని మోడీ తనకు ఏ చిక్కు సమస్య ఎదురైనా...దేశభక్తి గురించి, దేశ సరిహద్దుల్లో అన్నింటికీ తెగించి కావలి కాస్తున్న వీర జవాన్ల గురించి మాట్లాడతారు. నోట్ల రద్దును విమర్శిస్తే బొత్తిగా దానితో సంబంధం లేని వీర సైనికుల ప్రస్తావన మన్ కీ బాత్‌లో తీసుకు వచ్చారు. మనకు ఎంత దేశభక్తి ఉన్నా అది ఆ వీర సైనికుల తెగువ పాటిది కాలేదు కదా అని మనం మిన్నకుండిపోతాం. అయితే తాజాగా మోడీ ప్రభుత్వం ఆ రక్షణ రంగం లోని సిబ్బంది పెన్షన్లకే ఎసరు పెడుతూ ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. ఒక పక్క లడఖ్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. ఇంకొక వైపున మిలిటరీ వ్యవహారాల శాఖ (ఇది ముఖ్య సైన్యాధికారి బిపిన్ రావత్ నాయకత్వంలో పని చేస్తుంది) ఇటీవల మన సైనికుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ, అదే సమయంలో వారి పెస్షన్‌ను తగ్గిస్తూ ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది.
ప్రస్తుతం 20 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే పూర్తి పెన్షన్‌కు అర్హత వస్తుంది. ఇప్పుడు చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం 20 సంవత్సరాల సర్వీసుకు 50 శాతం పెన్షన్ మాత్రమే వస్తుంది. 26 నుంచి 30 సంవత్సరాల సర్వీసుకు 60 శాతం, 31 నుంచి 35 సంవత్సరాలకు 75 శాతం, అంతకు మించి సర్వీసు చేస్తేనే 100 శాతం పెన్షన్ వస్తుంది. ఇంతవరకూ 20 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన సైనికోద్యోగులు పదవీ విరమణ చేయవచ్చు. కొత్త ప్రతిపాదనలలో వారికా అవకాశం లేదు. రిటైర్‌మెంట్ దాకా సర్వీసులో కొనసాగాల్సిందే. కల్నల్ హోదాకు ఇంతవరకూ 54 ఏళ్ళు రిటైర్మెంట్ వయస్సు. ఇప్పుడు దానిని 57కు, అలాగే బ్రిగేడియర్ హోదాకు 56 నుండి 59కి పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదలను త్రివిధ దళాల సిబ్బందీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న చర్చలు సూచిస్తున్నాయి. సైన్యం లోని సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే ఇటువంటి ప్రతిపాదనలను మోడీ ప్రభుత్వం జనరల్ బిపిన్ రావత్ ద్వారా ఎందుకు ముందుకు తెచ్చినట్టు? యువ రక్తంతో నింపాల్సిన సైన్యంలో వృద్ధ నాయకత్వాన్ని ఎందుకు పెంచుతున్నారు?
రక్షణ బడ్జెట్‌లో పెన్షన్ల నిమిత్తం ఖర్చు చేయవలసిన మొత్తం పెరుగుతోంది. అందువలన రక్షణ కొనుగోళ్ళ కోసం కేటాయింపులు తగ్గుతున్నాయి. ఈ కొత్త ప్రతిపాదనలను సమర్ధించుకోడానికి ముందుకు తెస్తున్న వాదనలు ఈ తీరుగా ఉన్నాయి- ''2015లో పెన్షన్ల కోసం రూ.55,000 కోట్లు ఖర్చు చేస్తే అది కాస్తా ఇప్పుడు రూ.1.33 లక్షల కోట్లకు పెరిగింది. అందువలన రక్షణ రంగానికి అవసరమైన కొత్త యుద్ధ నౌకలను, అధునాతన ఆయుధాలను, విమానాలను సమకూర్చుకోలేక పోతున్నాం. దేశం మొత్తం మీద 32 లక్షల మంది పెన్షనర్లు (కేంద్ర పరిధిలో) ఉంటే 16 లక్షల మంది రక్షణ రంగానికి చెందినవారే ఉన్నారు. కాబట్టి ఈ పెన్షన్ ఖర్చును తగ్గించుకోవడం అవసరం.''
మిలిటరీని ఆధునీకరించడానికి అదనపు నిధులు కావాలి. మన దేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఒకటి. అయితే ఈ ఆధునిక ఆయుధాలు చాలావరకు ఆటోమేటిగ్గా పని చేసేవి. అందుచేత వాటిని ఉపయోగించేందుకు తక్కువమంది సరిపోతారు. అంటే తగ్గించాల్సింది సైన్యాన్ని. అంతే తప్ప పెన్షన్లను కాదు. అదే విధంగా రిటైర్‌మెంట్ వయస్సును పెంచడంలో అర్ధం లేదు. ద్రవ్యలోటు పెరిగిపోకుండా ఉండాలంటే ఖర్చు తగ్గించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒత్తిడి చేస్తుంది. దానికి మోడీ ప్రభుత్వం తలొగ్గుతుంది. మరి ఖర్చు తగ్గించుకోవాలన్నప్పుడు మోడీ తన వ్యక్తిగత వినియోగానికి ఖరీదైన జెట్ విమానాలను కొత్తగా కొనుగోలు చేయడమెందుకు? దేశ రాజధానిలో బోలెడు ప్రజాధనం వృధా చేసి కొత్తగా పార్లమెంటు భవనం నిర్మించడం ఎందుకు? లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడమెందుకు?
రక్షణ రంగంలో పెన్షన్లను కుదించడంతోబాటు డిఫెన్స్ క్యాంటీన్లను బాగా కుదించాలని, వాటిలో అమ్మే సరుకులను, ముఖ్యంగా విదేశీ సరుకులను బాగా తగ్గించాలని కూడా ప్రతిపాదించారు. ఇప్పుడు దేశంలో రిటైల్ అమ్మకాలు జరిపే సంస్థల్లోకెల్లా బాగా లాభాలను ఆర్జిస్తున్నది ఈ డిఫెన్స్ క్యాంటీన్లే. వాటి వార్షిక లాభం రూ. 200 కోట్లకు పైనే ఉంటుంది. రిలయన్స్ కన్నా, బిగ్‌బజార్‌ల కన్నా ఇది ఎక్కువ. అందుచేత వీటిని కుదించాలన్న ప్రతిపాదన ఎవరికి మేలు చేకూర్చడానికో స్పష్టం అవుతూనే వుంది కదా.
జనరల్ రావత్ సరిహద్దుల్లో వుండి పోరాడే బృందాలకి, తక్కిన సైనిక విభాగాలకు మధ్య ఒక విభజన రేఖ గీసేందుకు కూడా పూనుకున్నారు. పోరాడని బృందాలకు అంతగా ప్రాధాన్యత లేదని రావత్ అభిప్రాయం. ఈ చర్చను లేవనెత్తడం వెనక కూడా మిలిటరీ సేవలను అందించే రంగం లోకి పెద్దఎత్తున విదేశీ సంస్థల ప్రవేశానికి అవకాశం కల్పించే ఉద్దేశ్యం ఉంది. సప్లై, మెయింటినెన్స్ పనుల్లో ఔట్‌సోర్సింగ్ ద్వారా జొరబడేందుకు చాలా అమెరికన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ ఒత్తిడులు బాగా పెరుగుతున్నాయి. మన రక్షణ బడ్జెట్‌ను ఇంకా పెంచాలని, అందులో కొనుగోళ్ళకు, ఔట్‌సోర్సింగ్ సేవలకు మరింతగా కేటాయింపులు పెంచాలని వస్తున్న ఒత్తిడులకు లొంగుతున్నందు వల్లనే మోడీ ప్రభుత్వం ఈ విధంగా అనాలోచితంగా వ్యవహరిస్తోంది. ఈ చర్యల వలన మన రక్షణ సిబ్బంది ఆత్మస్థైర్యం, పాటవం దెబ్బతినిపోతాయి. అంతకంతకూ అమెరికన్ కాంట్రాక్టర్లపై మన రక్షణ కోసం ఆధారపడే దుస్థితి దాపురిస్తుంది.
ఇది మన మోడీగారి ఆత్మ నిర్భరత!
* బి.అర్జున్ (సంక్షిప్త అనుసరణ)










