Aug 16,2023 20:24
  •  20 నుంచి 26 వరకు నిర్వహణ
  •  13 జిల్లాల నుండి హాజరు కానున్న అభ్యర్థులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : భారత్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ (అగ్నిపథ్‌) ర్యాలీని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, కల్నల్‌ పునీత్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో మీడియాకు వివరాలు వెల్లడించారు. నరసరావుపేటలోని జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలో తెల్లవారుజామున నాలుగు గంటలకే ర్యాలీ ప్రారంభం అవుతుందని చెప్పారు. ర్యాలీని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ గుంటూరు ఆధ్వర్యంలో హెచ్‌క్యూ దక్షిణ్‌ భారత్‌ ఏరియా - హెచ్‌క్యూ రిక్రూటింగ్‌ జోన్‌, చెన్నై పర్యవేక్షిస్తుందని తెలిపారు. అభ్యర్థుల కోసం తాగునీరు, తాత్కాలిక మొబైల్‌ మరుగుదొడ్లు, వైద్య సహాయ కేంద్రం ఏర్పాట్లు చేశామన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌ (పదవ తరగతి), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌ (ఎనిమిదవ తరగతి), అగ్నివీర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ విభాగాల్లో అభ్యర్థుల భర్తీకి కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (సిఇఇ) ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేసిన ఐదు వేల మంది వరకు అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారని, వీరు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన వారని వివరించారు. ఒకవేళ వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో జెసి శ్యామ్‌ప్రసాద్‌, డిఆర్‌ఒ వినాయకం పాల్గొన్నారు.