ఇంఫాల్ : మణిపూర్‌లోని ఇథమ్ గ్రామంలో 1,200 మందికి పైగా మహిళల నేతృత్వంలోని గుంపు చుట్టుముట్టిన తరువాత భారత సైన్యం ఆదివారం 12 మంది ఉగ్రవాదులను విడుదల చేసింది. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఇథమ్ లో మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంతో సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టాయి. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు మహిళల నేతృత్వంలో సుమారు 1200 నుంచి 1500 మంది ఆర్మీ వాహనాలను చుట్టుముట్టారు. వాహనాలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే తమకు అడ్డుకోవద్దని సైన్యం హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.
కొన్ని గంటలపాటు పరిస్థితి అలాగే కొనసాగడంతో అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి చేయిదాటిపోకముందే 12 మంది మిలిటెంట్లను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండానే ఉద్రిక్తపరిస్థితి సద్దుమణిగింది. అనంతరం గ్రామంలో పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని సైనికులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే గ్రామస్తులు ఎదురుతిరగడంతో మొయితీ వర్గానికి చెందిన మిలిటెంట్ గ్రూప్ కంగ్లీ యావోల్ కన్నా లుప్ సభ్యులు తప్పించుకున్నారు. వారిలో మొయిరంగథెం తంబా కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. అతడు 2015లో 6 డోగ్రా రెజిమెంట్‌పై జరిగిన దాడితో సహా అనేక ఘటనల్లో ప్రధాన సూత్రధారి అని తెలిపారు. రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో మెయిటీ, కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణలతో మణిపూర్‌లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.










