న్యూఢిల్లీ : రాజకీయ పార్టీల్లో చీలికలు తెచ్చేందుకు ప్రధాని మోడీ ప్రాధాన్యతనిచ్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. భద్రతా దళాల్లో రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని, అయితే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రధానికి సమయం లేదని ఎద్దేవా చేశారు. ఉన్న సమయమంతా రాజకీయ పార్టీల్లో చీలికలు తెచ్చేందుకే సరిపోతుందని దుయ్యబట్టారు. 'జాతీయవాదం' అంటూ ప్రతిరోజూ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నవారే.. సైన్యానికి మరెవరూ చేయలేనంతగా ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఖర్గే స్పష్టం చేశారు.
సైనికుల కోసం నిధులు లేవని అగ్నిపథ్ స్కీమ్ కింద మోడీ ప్రభుత్వం స్పష్టంగా అంగీకరించిందని అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఒఆర్‌ఒపి) అమలు చేస్తూ సైన్యానికి మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని, ప్రస్తుతం ఒఆర్‌ఒపి-2తో జవానుల మధ్య విభేదాలు సృష్టించిందని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వానికి, బిజెపికి జాతీయ భద్రత ప్రాధాన్యత కలిగిన అంశం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.










