Feb 16,2023 22:07

తూమకుంట పారిశ్రామిక వాడ

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పారిశ్రామిక వాడలోని పరిశ్రమలను తనిఖీ చేయడానికి కర్నూల్‌ నుంచి గురువారం వచ్చిన బాయిలర్‌ ఇన్స్‌పెక్టర్‌ తూతూమంత్రపు తనిఖీలు చేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. తాను తనిఖీకి వస్తున్నట్లు ముందుగానే పరిశ్రమల నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో పాటు, తూతూమంత్రపు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తనిఖీల అధికారులు వివరాలు వెల్లడించకుండా, పారదర్శకత పాటించకుండా ఉండటం వెనుక మామూళ్లే కారణమన్న ఆరోపణలు వినపడుతున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడ హిందూపురం రూరల్‌ మండలం తూమకుంట, గోళాపురం ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ చిన్న పెద్ద పరిశ్రమలు కలిపి దాదాపు 150కి పైగా ఉన్నాయి. హిందూపురం పారిశ్రామిక వాడలోని పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రధానంగా ఉన్న ఇనుము-ఉక్కు తయారీ పరిశ్రమల్లో బాయిలర్లు పగిలి ఆగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం రివాజుగా మారింది. ఈ ప్రమాదాల్లో కార్మికులు మరణించడం, గాయపడటం ఏటా జరుగుతోంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వివరాలు సైతం సరిగా బయటకు రావడం లేదు. కార్మిక శాఖ అధికారులు వలస కార్మిక చట్టం అనుసరించి వారి వివరాలను సేకరించాల్సి ఉన్నప్పటికి చట్టాన్ని వారు అమలు చేయడం లేదు. వలస కార్మికుల కష్టాలను ఎవరూ ఎవరూ పట్టించుకోరు. పారిశ్రామిక వాడలోని రసాయనాల తయారీ పరిశ్రమలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదకరమయిన రసాయనాలను సైతం బయటకు వదిలేస్తున్నారు. వేసవిలో పరిశ్రమల్లోని బాయిలర్లు పేలి, ప్రమాదాలు చోటు చేసుకోనే అవకాశం ఎక్కువ. దీంతో సంబంధిత అధికారులు తప్పని సరిగా తనిఖీలు నిర్వహించి, పరిశ్రమల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను వారికి చెప్పాలి. అయితే ఈ శాఖ అధికారులు పరిశ్రమల నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో పాటు మధ్యాహ్న బోజనం ఏర్పాటు చేయాలంటు మెనూ సైతం చెప్పి పరిశ్రమలోనే భోజనాలు చేసి, తూతూమంత్రపు తనిఖీలకు పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నుంచి రావడం, పోవడంతోనే సరిపెడుతున్నారు. ఇదే రీతిలో గురువారం కర్నూల్‌ నుంచి బాయిలర్‌ ఇన్స్‌పెక్టర్‌ పరిశ్రమల నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో పాటు, తూతూమంత్రపు తనిఖీలు నిర్వహించి, తనిఖీకి సంబందించిన వివరాలు ప్రజాశక్తి అడిగినప్పటికి వెల్లడించకుండా వెళ్లిపోయారు. కనీసం ఎన్ని పరిశ్రమలు తనఖీ చేశారు. లోటు పాట్లు ఉన్నాయా..? అని అడిగినప్పటికి తనకు 20 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి అనంతపురం వద్ద మరో పరిశ్రమను తనఖీ చేయాలని వెళ్లిపోయారు. కర్నూలు నుంచి రావడం, పోవడంతోనే సరిపెడుతున్నారు. తనిఖీల అధికారులు వివరాలు వెల్లడించకుండా, పారదర్శకత పాటించకుండా ఉండటం వెనుక మామూళ్లే కారణమన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఏఏ పరిశ్రమను తనిఖీ చేశారు.. వాటిలోని బాయిలర్‌లను మళ్లీ ఎప్పుడు తనిఖీ చేస్తారు అనేది పరిశ్రమ బయట నోటీసు బోర్డులో ఉంచాల్సి ఉన్నా, పట్టించుకోకపోవడం గమనార్హం.