పుట్టపర్తి అర్బన్ : మండలి ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని కలెక్టర్ బసంత్ కుమార్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో కలెక్టరేట్లోని స్పందన మినీహాల్లో జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా, పారదర్శకంగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ మేరకు ఈనెల 16న నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న నామినేషన్ల ఉపసంహరణ మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికలు మార్చి 21 లోగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 13 నుంచి ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అనంతరం వాటిని పరిశీలించి ఓటింగ్ నాటికి తుది జాబితాలో పేర్లు నమోదు చేస్తామన్నారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఓటర్ నమోదు చేయించుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఎన్నికలు నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, వైఎస్సార్ ప్రతినిధి ఆవుటాల రమణారెడ్డి, టిడిపి నుంచి సామకోటి ఆదినారాయణ, సిపిఎం నాయకులు ఈఎస్.వెంకటేశు, పైపల్లె గంగాద్రి, బిజెపి నుంచి జ్యోతిప్రసాద్ పాల్గొన్నారు.










