నదీ జలాల పంపిణీ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపించిన తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు పులిచింతల నుండి సైతం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తికి పూనుకుంది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులూ 'జల దోపిడీ' అని ఒకరంటే 'చూస్తూ ఊరుకోం...' అని మరొకరంటూ తమదైన శైలిలో పరస్పర దూషణలకు దిగారు. మంత్రివర్గ సమావేశాల్లో తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడం కన్నా ఎదుటివారిని ఎలా ఇరుకున పెట్టాలా అన్నదే ఎక్కువగా చర్చిస్తున్నారు. ప్రజలకు తాగు నీరు, సాగు అవసరాలు, జల విద్యుత్తు, పారిశ్రామిక అవసరాలు... ఇలా నీటి వినియోగ ప్రాధాన్యతలు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా నిర్ణయించబడి ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ, ఏవైనా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే సర్దుబాటు చేసుకొని పరస్పరంగీకారంతో ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించుకోవాలి. ప్రపంచమంతటా కొన్ని దేశాల మధ్య, మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సాధారణంగా ఇలాగే జరుగుతోంది. దానికి భిన్నంగా ఇంజనీర్లు, నిపుణులూ మసలాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టు సైట్లలో ఇప్పుడు పోలీసుల బూటు చప్పుళ్లు వినవస్తున్నాయి.
కృష్ణానది కిందనున్న ప్రాజెక్టులకు ఇప్పటికే నీరు సక్రమంగా అందడం లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కేటాయించిన అదనపు జలాలను వారు వినియోగించుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు మిగులు జలాలు కాదు కదా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలకు కూడా గ్యారంటీ ఉండదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా జలాలలో తమ వాటాగా ఉన్న నికర జలాలకు గ్యారంటీని పొందడంతో పాటు బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన పద్ధతిలో మిగులు జలాలను వినియోగించుకునే హక్కును తెలుగు రాష్ట్రాలు కాపాడుకోవాలి. అలాంటి కృషి జరగాలంటే ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసం, పూర్తి సదవగాహన ఉండాలి. ఇరు రాష్ట్రాలూ ఉమ్మడిగా కేంద్ర పెత్తనాన్ని ఎదుర్కోవలసింది పోయి ఘర్షణ పడడం నష్టదాయకం. పైపెచ్చు తమ మధ్య వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని కోరడమనేది పిట్టల పోరు పిల్లి తీర్చిన చందమవుతుంది. కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బిజెపి ఈ రాష్ట్రాల్లో ఏ రోటికాడ ఆ పాట పాడుతోంది. ఈ సమయంలో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అదే బాటలో టిఆర్‌ఎస్, వైసిపి తక్షణ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి వ్యవహరిస్తున్నాయి.
నీటి సమస్యలు భావోద్వేగాలను తీవ్రతరం చేయడం సహజం. అవి పెరగడంతో కొన్ని ప్రధాన సమస్యలు సైతం మరుగున పడిపోయే ప్రమాదముంది. అటు ఆర్థిక సంక్షోభం, ఇటు కరోనా విపత్తుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవలసిందిపోయి పెట్రోల్ డీజిల్‌తో సహా నిత్యావసరాల ధరలను పెంచి కేంద్రం జనం నడ్డి విరుస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రకరకాల పేర్లతో పన్నులు, జరిమానాలతో జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ విషయాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నీటి పంపిణీ అంశాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగిస్తాయి కనుక కేవలం పాలక పార్టీ మాత్రమే తమకు తోచినదేదో చేసుకుపోవడం కాకుండా అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉమ్మడి అభిప్రాయాన్ని కూడగట్టడం అవసరం. వారలా చేయడం లేదు కనుక అందుకు ప్రజలు ఒత్తిడి చేయాలి.
సున్నితమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వాటా నికర జలాలకు కట్టుబడి ఉంటూ, మిగులు జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఉభయులకూ నష్టదాయకం. ఉభయ ప్రభుత్వాలు వీలున్నంత త్వరగా సామరస్యంగా జల వివాదాలను పరిష్కరించుకుని ఇటు రాయలసీమ అటు తెలంగాణ లోని కరువు ప్రాంతాలకు నీటిని తరలించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఘర్షణల వల్ల నష్టపోయేది రెండు రాష్ట్రాల ప్రజలే !










