పెనుకొండ : ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సాగుదారులందరికి అసైన్మెంట్ చేసి భూ పంపిణీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా నాయకులు నాగరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు తిప్పన్న, నరసింహులు, క్రిష్టప్ప, రాజశేఖర్, రామాంజనమ్ము, తిప్పన్న, సాగుదారులు పాల్గొన్నారు.
రొద్దం : గత కొన్నిసంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి పాసుపుస్తకాలు మంజూరు చేయాలని సాగు రైతులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సోమవారం మండలంలోని కోగిర, కంబాలపల్లి, శాపురం గ్రామాలకు చెందిన భూములు లేని నిరుపేదలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ అనంతచారికి సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కోగిర కంబాలపల్లి, షాపురం గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీలు సర్వేనెంబర్ 666, 667, 668, 669లోనిదాదాపు 500 ఎకరాల భూమిని12 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని అన్నారు. అధికారులు ఈ భూములను పరిశీలించి అసైన్మెంట్ చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రాముడు, నారాయణప్ప, ఆదినారాయణ, బాలకృష్ణ, గంగాధర్‌తో పాటు అధికసంఖ్యలో సాగురైతులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో దేమకేతేపల్లి పంచాయతీ ఓబులాపురం రైతులు డిప్యూటీ తహశీల్దార్ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేమకేతేపల్లి పంచాయతీ ఓబులాపురంలో 50 సంవత్సరాలుగా 377 సర్వే నెంబరు లో దాదాపు 50 మంది 135 ఎకరాల్లో, సర్వే నెంబరు 67 లో 8 మంది రైతులు సాగులో ఉన్నారన్నారు. వీరికి 8 వ విడత భూ పంపిణీలో పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రమేష్, సిపిఎం నాయకులు రామచంద్ర, నరసింహ, రైతులు మాబు, శ్రీనివాసులు, నంజుండ, నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : మండల పరిధిలోని పలు గ్రామాలలో సాగు చేస్తున్న సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సాగురైతులు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాకాలంగా తుంగొడు, పందిపర్తి రెవెన్యూ గ్రామాలోని పొలాలలో పంటల సాగు చేస్తున్న నిరుపేద రైతులకు ఎనిమిదో విడత భూ పంపిణీలో పట్టాలు ఇవ్వాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ సిద్దేశ్వర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప, కొండా వెంకటేశు, షీలా నారాయణస్వామి, సాగుదారులు నాగరాజు, అంజనమ్మ, మారెక్క, గుర్రప్ప, రాధా, వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
నంబుల పూలకుంట : పభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పేదరైతులతో కలసి సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా 'సోలార్ వద్దు వ్యవసాయం భూమి ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు బడా సుబ్బిరెడ్డి మాట్లాడుతూ పేద రైతులకు భూమిని పంపిణీ చేయడంలో పాలకులు, అధికారులు నానా నిబంధనలు విధిస్తారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిరెడ్డి, నాగరాజు, శివయ్య, శ్రీరాములు, రైతులు పాల్గొన్నారు.










