Nov 06,2022 09:11
  • కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన 'కాంతారా' ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.50 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. రిషబ్‌ హీరోగా నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు నడుస్తోన్నా కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. కాగా 'కాంతార' చిత్రం ఊహించని విజయాన్ని సాధించిందని, ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టి అన్నారు. విజయోత్సవ యాత్రలో భాగంగా తిరుపతి విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. అవేంటో తెలుసుకుందాం

రిషబ్‌ శెట్టి భారతీయ దర్శకుడు, నటుడు. ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. బెంగళూరులోని గవర్నమెంట్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇన్‌స్టిట్యూట్‌ నుండి ఫిల్మ్‌ డైరెక్షన్‌లో డిప్లొమా పొందారు. కాగా 'కాంతార' చిత్రానికి హీరో కమ్‌ డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి. ఆయన తన ఊర్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆయన సతీమణి ప్రగతిశెట్టి, కూతురు రాధ్య కూడా ఈ చిత్రంలో నటించారు. కాగా కథ బయటివాళ్లకు అద్భుతంగా చూపించడంతో రిషబ్‌ శెట్టి ఒక్క సినిమాతోనే పాపులర్‌ అయ్యారు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు కొందరు ఇతర ఇండిస్టీల నిర్మాతలు ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇటీవల తెలుగులో ఓ సినిమా చేయాలని గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ అడిగిన వెంటనే రిషబ్‌ ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన జీవితం పూలపాన్పేమీ కాదు. మనకు తెలియని ఎన్నో కన్నీళ్లు, కష్టాలు తన జీవితంలో ఉన్నాయంటున్నారీ కన్నడ హీరో. ప్రస్తుతం 'కాంతారా' సినిమా సక్సెస్‌ను మనసారా ఆస్వాదిస్తోన్న రిషబ్‌ శెట్టి తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా తన జీవితంలోని చేదు అనుభవాలు, గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
వేషాలతోనే తిరిగేవాణ్ణి..
'నా ఖర్చుల కోసం చదువుకునేటప్పుడే మినరల్‌ వాటర్‌ వ్యాపారం మొదలుపెట్టాను. రాత్రంతా నీళ్లు సప్లై చేసి, వ్యానులోనే నిద్రపోయేవాడిని. ఇందులో వచ్చిన డబ్బుతో సినిమాల్లోకి వెళ్లాను. కానీ ఏడాదిపాటు షూటింగ్‌లో పనిచేస్తే రూ.1500 వచ్చాయి. దీంతో సినిమాలు వద్దనుకుని హోటల్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాను. నా వద్ద ఉన్న డబ్బుతో పాటు కొంత అప్పు చేసి 2009లో హోటల్‌ ప్రారంభించాను. కానీ ఐదు నెలల్లోనే నష్టాల్లో కూరుకుపోయాను. పెట్టుబడిపోనూ రూ.25 లక్షల అప్పు మిగిలింది. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ వేరేవారి దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. అలా 2012 వరకూ ఈ అప్పులు కడుతూనే ఉన్నాను. అయితే ఎన్ని కష్టాలెదురైనా సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. వేషాల కోసం తిరిగాను. ఆ సమయంలో అప్పులోళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు సినిమాల్లోని వేషాలతోనే బయటా తిరిగేవాణ్ణి. అలాగే చిన్న సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశాలు పొందాను. ఆ తర్వాత కొందరు స్నేహితుల సహకారంతో సినిమాలు తెరకెక్కించాను' అంటూ తన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
తెలుగు ప్రేక్షకుల అభిమానం మరువలేను..
తనపై చూపుతున్న ఆదరాభిమానాలు ఎంతో విలువైనవని, భాషా భేదం లేకుండా తన పట్ల తెలుగు ప్రేక్షకులు చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. మరో రెండు నెలల తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటిస్తానన్నారు. అయితే తను చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలు చూస్తున్నానని, సీనియర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌స్టార్‌ కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు చూసేవాడినని, ఇకపోతే మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ సినిమాలు కూడా చూస్తానని చెప్పారు రిషబ్‌.
కొబ్బరినీళ్లు మాత్రమే తీసుకున్నా..
భూతకోల సన్నివేశం చేసేటప్పుడు దాదాపు 50 నుంచి 60 కిలోల బరువు క్యారీ చేసినట్లు తెలిపారు. 'భూతకోల సీక్వెన్స్‌ కోసం షూటింగ్‌ మొదలు 20 నుంచి 30 రోజుల ముందు నుంచి నాన్‌వెజ్‌ తినడం మానేశా. దైవ కోల వేసినప్పుడు దాదాపు 50 నుంచి 60 కిలోల బరువును క్యారీ చేశాను. కన్నడ ప్రజలు అత్యంత పవిత్రంగా చూసే ఈ దైవ కోల అలంకరణ వేసిన అనంతరం కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తీసుకున్నాను. అయితే ఈ కోల సీక్వెన్స్‌ వేయడానికి ముందు ఆ తర్వాత ప్రసాదం ఇచ్చేవారు' అని రిషబ్‌ చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రంపై సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్‌.. రిషబ్‌శెట్టిని ఇంటికి పిలిపించి, శాలువాతో సత్కరించారు. 'కాంతార' సినిమా గురించి రిషబ్‌తో చాలాసేపు మాట్లాడారని తెలిపారు.
పేరు : రిషబ్‌ శెట్టి
అసలు పేరు : ప్రశాంత్‌ శెట్టి
పుట్టిన తేదీ : జులై 7, 1983
పుట్టిన ప్రాంతం : కేరడి, కర్ణాటక
నివాస ప్రాంతం : కుండాపుర, కర్ణాటక
చదువు : ఎంబిఎ, డిప్లొమో ఇన్‌ ఫిల్మ్‌ డైరెక్షన్‌
భార్య : ప్రగతి శెట్టి
పిల్లలు : రన్విత్‌ శెట్టి, రాధ్యా శెట్టి
తల్లిదండ్రులు : భాస్కర్‌ శెట్టి, లక్ష్మి శెట్టి
తోబుట్టువులు : ప్రతిభా హెగ్డే