చిలమత్తూరు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం రాసాబాసగా కొనసాగించింది. ఈసందర్భంగా మండల అభివృద్ధి అధికారిపై కోడూరు పంచాయతీకి చెందిన ఇద్దరు ఎంపిటీసిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా మధురేపల్లి రోడ్డు కు గ్రావెల్ ఎలా వేశారని ప్రశ్నించారు. ఆ వర్క్ పై సమావేశంలో ఎలాంటి చర్చా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి, కోడూరు పంచాయతీ కి చెందిన ఎంపిటీసి, వైస్ ఎంపిపి నిర్ణయం మేరకు చర్చించి పనిని పెట్టామని ఎంపిడిఒ సమాధానం ఇచ్చారు. వైస్ ఎంపిపి అంజలీదేవి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా ఉన్న తమకు మండల పరిషత్ నిధులు వినియోగించుకునే హక్కులేదా అని ప్రశ్నించారు. మరో వైస్ ఎంపిపి బయన్న సైతం గతంలో కూడా సమావేశంలో ఎలాంటి చర్చా లేకుండా అనేక పనులు చేశారు. వాటిని క్యాన్సిల్ చేస్తే దీనిని కూడా క్యాన్సిల్ చేసుకుంటామని అన్నారు. దీంతో కాసేపు సమావేశం రచ్చరచ్చగా మారింది. చివరిగా తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల నిబందనల నేపధ్యంలో రాజకీయనాయకులు ప్రచారాలకు సంబందించిన పోస్టర్లు బ్యానర్లు తొలిగించాలని, నిబందనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ అనుషాతో పాటు ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఎంపిపి జగన్మోహన్ ఎంపీడీవో డి అంజనప్పను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ జగన్మోహన్ మాట్లాడుతూ. 90 రోజులకు ఒక్కసారి నిర్వహించే మండల సమావేశానికి హాజరుకాకపోతే సభ్యులు వారి గ్రామాల సమస్యలను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సర్పంచులు సుధాకర్, శివప్ప నాయుడు, అనసూయమ్మ తదితరులు మాట్లాడుతూ మూడు సంవత్సరాలైనా పంచాయతీ నిధులు రాకపోవటంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నామన్నారు. ఈ సమావేశంలో. జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎస్ ఫయాజ్ అలీ, వైస్ ఎంపీపీలు గంగోజమ్మ, భారతి, తహశీల్దార్ రవితో పాటు ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.










