Dec 22,2021 08:00
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం
  • తాజాగా సేకరించి ఇచ్చేందుకు సన్నాహాలు
  • వచ్చే నెలలో రెండు కోటాలు ఒకేసారి పంపిణీ

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో చౌకధరల దుకాణాల ద్వారా డిసెంబర్‌ నెలలో రెండో విడత రేషన్‌ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రధానమంత్రి కల్యాణ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా గత ఏడు నెలలుగా ఒక కోటాను బియ్యం కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కిలో బియాన్ని రూపాయికి అందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తోంది. అయితే, ఈ నెలలో రెండో విడత బియ్యం పంపిణీ 20 నుంచి ప్రారంభించాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకూ బియ్యం సరఫరా జరగలేదు. తమ వద్ద నాన్‌ సార్టెక్సు బియ్యం అందుబాటులో లేవని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐకి తెలిపింది. ఎఫ్‌సిఐ గోదాముల్లో బియ్యం నిల్వలు ఉన్నా వీటిని తాము ఇతర రాష్ట్రాల్లో పంపిణీ చేసుకోవాల్సి ఉందని, మీ ప్రజా పంపిణీ మీరే చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ షరతు విధించింది. తమ వద్ద సార్టెక్సు బియ్యం మాత్రమే ఉన్నాయని, నాన్‌ సార్టెక్స్‌ బియ్యం లేవని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో పంపిణీపై చేతులెత్తేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి పక్షంలో ప్రతి నెలా శుభ్రపరిచిన సార్టెక్సు బియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 29,782 చౌక డిపోల ద్వారా 1,44,77,696 కార్డులకు రూపాయి బియ్యం ఒక విడత, ఉచిత బియ్యం మరో విడత సరఫరా అవుతున్నాయి.
ఉచిత బియ్యం వచ్చే మార్చి వరకు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రతి నెలా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. నవంబరులో 1.20 కోట్ల మంది కార్డుదారులకు 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరిగింది. ఇంత మొత్తంలో ప్రస్తుతం నాన్‌ సార్టెక్సు బియ్యం తమ వద్ద లేవని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఎఫ్‌సిఐ మీరే సేకరించుకుని పంపిణీ చేసుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో, అధికారులు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్‌ చేసి వచ్చే నెలలో ఒకేసారి రెండు కోటాలు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.