Jul 18,2021 15:25

హైదరాబాద్‌ : రేపటి నుంచి 'ప్రజా దీవెన యాత్ర' చేపడుతున్నానని, ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు అని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జులై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను' అని చెప్పారు. 'ఉదయం 7.30 గంటలకు కమలాపూర్‌ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్‌ దేవస్థానం నుండి ప్రారంభం అయ్యే ఈ ప్రజా పాదయాత్రకు మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకు మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు' అని ప్రకటించారు.