చేసిన తప్పు సరిదిద్దుకోకుండా మోడీ రైతులపై ఎదురు దాడికి దిగారు. రైతుకు మద్దతు ఇచ్చే వారందరినీ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. 'నన్ను నమ్మండి! రైతును ఉద్ధరించడానికే వ్యవసాయ చట్టాలు చేశాను‘ అంటున్నారు. మోడీ 2014 ఎన్నికల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానన్నారు. పంటకు అయ్యే పెట్టుబడులపై 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయం చేయాలనే స్వామినాథన్ సిఫార్సు అమలు చేయలేదు. పైగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయలేమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మోడీని ఎలా నమ్మాలో విజ్ఞులైన వారు చెప్పండి.
రైతు కోరుతున్నది ఏమిటి? మోడీ చేసింది ఏమిటి?
కనీస మద్దతు ధర చట్టబద్ధం చేసి, అంతకు తక్కువకు కొన్నవారిని శిక్షించే చట్టం చేయమని రైతులు కోరుతున్నారు. కనీస మద్దతు ధర ఉంటుంది అంటున్న మోడీకి ఆ ముక్క చట్టంలో రాయడానికి అభ్యంతరం ఏమిటి? రైతుకు అన్యాయం చేసే వ్యాపారులను శిక్షించడానికి మోడీకి అభ్యంతరం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, వ్యాపారులు ఎవరి మీదా...రైతుగానీ, అతని తరఫున గాని ఎవరూ కోర్టుకు వెళ్ళడానికి లేదని మోడీ చట్టంలో ఎందుకు పొందుపర్చారు? ఇది కూడా రైతు మేలు కోరి చేశారంటారా? దేశ విదేశీ కంపెనీలు రైతును మోసం చేస్తాయని మోడీకి తెలుసు. అందుకే కోర్టుకు వెళ్లకుండా రైతు కాళ్ళూ చేతులు కట్టేయడానికే చేశారు కదా? రైతు ప్రశ్నకు 'నమ్మండి' అనడం తప్ప మోడీ వద్ద, అతని మద్దతుదారులైన జయప్రకాష్ నారాయణ వంటి వారి వద్ద సమాధానాలు లేవు.
కార్పొరేట్లకు ప్రజలను దోచుకునే స్వేచ్ఛ ఇవ్వలేదా?
ఎంతైనా నిల్వ చేసుకునే స్వేచ్ఛ రైతుకు ఇచ్చానని మోడీ అంటున్నారు. దేశంలో ఈ స్వేచ్ఛ లేక నష్టపోయిన రైతును ఒక్కరినైనా చూపిస్తారా? రైతు నిల్వ చేసుకునేందుకు పండిస్తాడా? లేక అమ్ముకు నేందుకు పండిస్తాడా? వేలు, లక్షల టన్నులు పండించే రైతులు దేశంలో వున్నారా? రైతుకు అక్కరలేని చట్టం ఎందుకు చేశారు? బడా వ్యాపారులకు ఇప్పటి వరకు వేలు, లక్షల టన్నులు నిల్వ చేసుకునే అవకాశం లేదు. మోడీ చట్టంతో వ్యాపారులకు భారీగా నిల్వ చేసి నిత్యావసరాలు బ్లాక్ చేసి ప్రజలను లూటీ చేసే సౌకర్యం కల్పించడం నిజం కాదా?
రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చా? ఎంత మోసం!
ఎక్కడైనా అమ్ముకునే హక్కూ, స్వేచ్ఛ ఈ చట్టంలో రైతుకు ఇచ్చానని మోడీ అంటున్నారు. ఇపుడు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు రైతుకు వున్న ఇబ్బంది ఏమిటి? రైతు దేశమంతా తిరిగి ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకోగలడా? రైతు వ్యాపారస్తుడు కాదని మోడీకి తెలియదా? రైతు ఎక్కడ ధర వుంటే అక్కడకు తీసుకెళ్ళి అమ్ముకోలేడని ప్రధానికి తెలియదా? దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలు దేశమంతటి నుండి పంటను ఎత్తుకు పోయేందుకు లైసెన్సు తప్ప రైతుకు ఏ ఉపయోగం వుండదని బిజెపి కి, దాన్ని బలపర్చిన వారికి తెలియదా? రాష్ట్రాలకు పన్నులు ఎగ్గొట్టి, రాష్ట్రాల అనుమతులు లేకుండా నేరుగా పంటను తీసుకుపోయేందుకు కార్పొరేట్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం అనుమతే ఇది. ప్రపంచ బ్యాంకు సిద్ధాంత బద్దులై, కార్పొరేట్ మిత్రులుగా, ఆపైన మోడీ చేతి లోని సిబిఐ కి భయపడి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి తప్ప రాష్ట్రాలకు, రైతులకు, ప్రజలకు నష్టమని తెలియక కాదు.
రైతును కూలీగా మార్చే కాంట్రాక్టు వ్యవసాయం
రైతు మొదట కంపెనీతో ఒప్పందం చేసుకుంటాడు. కంపెనీ చేసుకున్న ఒప్పందం అమలు చేయక, ధర ఇవ్వక మోసం చేసినా రైతు చేసేది ఏమీ లేదు. కాంట్రాక్టు రద్దు చేసుకొని స్వంతంగా వ్యవసాయం చేసినా మరల మార్కెట్లో ఆ కంపెనీల మోసమే ప్రత్యక్షం అవుతుంది. అప్పటికే ప్రభుత్వం మార్కెట్ నుండి తప్పుకొంటుంది. చిన్న వ్యాపారులను తిమింగలాల వంటి బడా వ్యాపార సంస్థలు మింగేస్తాయి. ఎటుచూసినా రైతుకు గోచరించేది విష వలయమే. చేసేదిలేక తన భూమిని కార్పొరేట్ కంపెనీకి లీజుకు ఇచ్చేసి కూలీగా మారిపోవడమే రైతుకు గతి. అందుకు అవసరమైన ఏర్పాట్లు మోడీ చట్టంలో చేసి వున్నారు. రైతు భూమిని స్వాధీనం చేసుకొని కంపెనీయే వ్యవసాయం చేస్తుంది. అదే కార్పొరేట్ వ్యసాయం. మోడీ చేసిన చట్టాల్లో ప్రతి ఒక్కటీ బడా వ్యాపారులకు తప్ప రైతుకు ఏం ప్రయోజనం కలుగుతుందో చెప్పమనండి?
ప్రజలను ఎలా దోచేస్తాయో చూడండి
విజయవాడలోని బిగ్ బజార్‌లో 200 గ్రాముల మిర్చి రూ.80. అంటే కిలో రూ.400. అదే బీసెంట్ రోడ్డులో కిరాణా కొట్టులో కిలో రూ.180. ఎంత తేడా! రేపు మోడీ చేసిన వ్యవసాయ చట్టాలు అమలైతే నిత్యావసర సరుకంతా కార్పొరేటు కంపెనీలకే చేరుతుంది. చిరు వ్యాపారులు అంతం అవుతారు. మిగిలేది బడా వ్యాపారులే. చిరు వ్యాపారుల పోటీ వున్నా ఇంత దారుణంగా దోచేస్తున్న బడా వ్యాపారులు...రేపు చిరు వ్యాపారులు అంతమైన తరువాత ప్రజలను బతకనిస్తారా!
రైతులు మాత్రమే కాదు.. అందరూ నష్టపోతారు
ప్రభుత్వం పంట సేకరించదు. ప్రభుత్వం వద్ద తిండి గింజలు, నిత్యావసరాలు ఉండవు. కనుక ప్రభుత్వ రేషన్ ఉండదు. రేషన్‌కు బదులు నగదు బదిలీ చేస్తామని మన రాష్ట్ర మంత్రులు ప్రచారం మొదలు పెట్టారు. అదే జరిగితే ప్రజలందరూ ప్రతి గింజ కోసం మార్కెట్ మీదే ఆధారపడాలి. అపుడు కార్పొరేట్ల దోపిడీకి అవధులు ఉండవు. మోడీ వ్యవసాయ చట్టాల వలన రైతులే కాదు. తిండి తినే ప్రతి ఒక్కరూ నష్టపోతారు. ప్రజలందరి నష్టమే దేశ విదేశీ కార్పొరేట్లకు లాభం. అదే మోడీ లక్ష్యం.
విద్యుత్ బిల్లు మహా ప్రమాదం
మోడీ చేసిన విద్యుత్ బిల్లులో పంపిణీ ప్రైవేటీకరణ చేయాలి. ఉచిత విద్యుత్ వుండదు. సబ్సిడీ 20 శాతం కంటే ఇవ్వకూడదు. స్మార్ట్ మీటర్లు పెట్టాలన్నవి ప్రధానమైన అంశాలు. ప్రైవేట్‌వారి నిర్వాకం ఎంత అద్వాన్నంగా వుంటుందో ఢిల్లీ, ఒడిషా అనుభవాలు చెబుతున్నాయి. ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే రైతుపై పెనుభారం పడుతుంది. పంట ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఆ భారమంతా ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఎస్‌సి, ఎస్‌టి లకు ఉచిత విద్యుత్ వుండదు. సబ్సిడీ కుదించడం వలన అందరిపై విద్యుత్ చార్జీల మోత తప్పదు. ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చడమే మోడీ విద్యుత్ చట్టం ఉద్దేశం. ఇందులోనూ రైతు ఒక్కడే నష్టపోడు. ప్రజలంతా నష్టపోతారు.
రైతు సంఘాలు, రాష్ట్రాలు, పార్లమెంటులో చర్చించలా
అరవై శాతం ప్రజలు జీవిస్తున్న వ్యవసాయ రంగంలో చట్టాలు ఎలా వుండాలో, వాటిలో ఏం వుండాలో రైతు సంఘాలతో గాక అంబానీ, అదానీ తదితర బడా వ్యాపార సంస్థలతో మోడీ చర్చిస్తున్నారు. ప్రధాని ఇంత వరకు ఏ ఒక్క కార్మిక, ఉద్యోగ, రైతు సంఘంతో ఒక్క నిముషం కూడా మాట్లాడి ఎరగడు. వ్యవసాయ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెలెక్టు కమిటీకి పంపమని మెజారిటీ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేసినా సెలెక్ట్ కమిటీకి పంపలేదు. బిల్లులను ఓటింగుకు పెట్టమని మెజారిటీ సభ్యులు పట్టుపట్టినా ఓటింగుకు పెట్టలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బిల్లులు పాస్ అయినట్లు సభాపతి ప్రకటించేశారు.
రైతులను ఒంటరి చేసే కుట్ర
రైతు తిరుగుబాటుతో మోడీ ప్రభుత్వం కంగుతిన్నది. అవినీతిపరులైన రాజకీయ నాయకులను, పార్టీలను లొంగదీసుకుని ఇష్టానుసారం చెలాయిస్తున్న బిజెపి, దాని కార్పొరేట్ మిత్రులు రైతుల నుండి ఇంత తీవ్రమైన ప్రతిఘటన ఎదురౌతుందని కలలో కూడా ఊహించలేదు. రైతులను ఒంటరి చేసి దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులనీ, పాకిస్తాన్, చైనా ఏజెంట్లనీ ముద్ర వేసి దేశ ప్రజల నుండి వేరు చేసే నీచాతినీచమైన ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఉద్యమాన్ని పంజాబుకే పరిమితం చేసి దేశ ప్రజల నుండి వేరు చేసే కుట్ర చేస్తున్నారు. ఇంకోవైపు అది కేవలం రైతు సమస్యేనన్న ప్రచారంతో మిగతా ప్రజలు భాగస్వాములు కాకుండా కుతంత్రాలు చేస్తున్నారు.
రైతుకు అన్ని వైపులా మద్దతు - విజయం రైతుదే
బిజెపి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం చెల్లవు. ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటున్నారు. దక్షిణాది రైతులు ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు. కార్మిక వర్గం సంపూర్ణ మద్దతునిస్తున్నది. కళాకారులు, కవులు, మేధావుల మద్దతు రైతుకు వున్నది. విద్యార్థి, యువత, మహిళల దన్ను వున్నది. మాజీ సైనికులు, సినీ ప్రముఖుల నుండి రైతుకు సహకారం వుంది. అంతర్జాతీయ సమాజం రైతు ఉద్యమాన్ని బలపరుస్తున్నది. రైతులు, కార్మికులు కలిస్తే ఎవరినైనా ఓడించి తీరుతారు. బిజెపి, కార్పొరేట్లను ఓడించేందుకు యావత్ ప్రజలు ఒక్కటై రైతుకు మద్దతు ఇవ్వాలి.
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)










