Jan 28,2021 15:44

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మంగళవారం చేపట్టిన అన్నదాతల ట్రాక్టర్‌ ర్యాలీని తప్పుదోవ పట్టించాడని రైతు నేతలు ఆరోపిస్తున్న పంజాబీ గాయకుడు, నటుడు దీప్‌ సిద్ధు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గణతంత్య్రం దినోత్సవం నాడు ఎర్రకోట వైపుకు రైతులు కదిలేలా దీప్‌ ప్రేరేపించాడని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఎర్రకోట వద్ద మతపరమైన జెండా ఎగురవేసే సమయంలో కూడా కనిపించిన సిద్ధు..అక్కడ పరిస్థితులు ఉద్రికత్తలు దారి తీయడంతో అక్కడ నుండి ఓ బైక్‌పై పరారవ్వగా..రైతులు అతడిని వెంబడించిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. కాగా..ఇప్పుడు తన వల్ల అంత మంది ప్రేరేపితమయ్యారా...అంటూ తన తప్పును మాఫీ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అయితే సోషల్‌ మీడియా ద్వారానే మాట్లాడుతున్న దీప్‌..ఎక్కడున్నాడన్నదీ తెలియరాలేదు.
మంగళవారం రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ సమయంలో కూడా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో లైవ్‌ స్ట్రీమ్‌ చేసిన సిద్ధూ.. ఆందోళనకారులు ఎరక్రోటపై మతపరమైన జెండాను ఎగుర వేయడాన్ని సమర్థించారు. అయితే, తాము జాతీయ పతాకాన్ని తొలగించలేదని, ఉద్యమానికి గుర్తుగా కేవలం సిక్కు మత చిహ్నమైన 'నిశాన్‌ షాహిబ్‌' జెండాను పెట్టినట్లు పేర్కొన్నారు. ఎర్రకోట వద్ద హింసాత్మక ఘర్షణలు తలెత్తిన తర్వాత బైక్‌పై పరారయ్యాడు.

పోలీసులకు దొరకని ఢిల్లీ అల్లర్ల కారకుడు దీపుసిద్దూ...కానీ వీడియో మెస్సెజ్‌ విడుదల
ఎవరీ దీప్‌ సిద్ధు
పంజాబ్‌లోని ముక్త్‌సర్‌ జిల్లాకు చెందిన దీప్‌ న్యాయశాస్త్రం చదివాడు. గతంలో మోడల్‌గా పనిచేసి.. తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాడు. పంజాబీలో పలు చిత్రాల్లో నటించాడు. 2019లో బాలీవుడ్‌ నటుడు, బిజెపి నేత సన్నీడియోల్‌ ...పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుండి పోటీ చేసినప్పుడు ఆయన తరుపున ప్రచారం చేపట్టాడు. రైతు సంఘాలు గత ఏడాది సెప్టెంబరు 25న బంద్‌కు పిలుపునిచ్చిన మసయంలో ఆందోళనలో పాల్గొని వెలుగులోకి వచ్చిన సిద్ధు... నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ సరిహద్దుల్లో రైతులు ఉద్యమాన్ని చేపడుతున్న వేదిక వద్దకు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, సిక్కు వేర్పాటువాది భింద్రన్‌వాలేలను దీప్‌ సిద్ధూ తరచూ ప్రస్తావించారు. దీంతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన రైతు సంఘాలు అప్పటి నుండే దీప్‌ను దూరం పెట్టసాగాయి. ప్రధాని మోడీతో సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో...ఇదంతా కుట్ర కోణంగా రైతు సంఘాలు భావిస్తున్నాయి.
రైతుల చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి..ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు గ్యాంగ్‌స్టర్‌ లఖా సిద్ధానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

deep sidh



దీప్‌ ఎక్కడ
ఉద్యమాన్ని పక్కదారి పట్టించాడని తనపై వస్తున్న ఆరోపణలపై దీప్‌ ఖండించారు. అల్లర్ల తర్వాత నుంచి కన్పించకుండాపోయిన సిద్ధూ.. గురువారం తెల్లవారుజామున సోషల్‌మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. తనను దేశద్రోహీ అంటూ రైతు నేతలు చేస్తున్న ఆరోపణలపై అసహనం వ్యక్తం చేశాడు. తాను దేశ ద్రోహిని కాదని, ఎర్రకోట వైపుగా రైతులు దూసుకెళ్లేందుకు తాను ప్రేరేపించలేదని అన్నారు. తానే ఇదంతా చేస్తుంటే.. మీరు ఎలా నాయకులవుతారు అంటూ రైతులపై ఎదురు దాడికి దిగారు. తాను దేశద్రోహి అయితే మీరు కూడా దేశద్రోహులే అవుతారని రైతులపై మండిపడ్డారు. పాపులారిటీ లేని వ్యక్తి అంత మందికి ఎలా నాయకత్వం వహించగలడు అంటూ తిరిగి ప్రశ్న వేశాడు. అయితే దీప్‌ సిద్ధూ ప్రస్తుతం ఎక్కడున్నారన్నది ఇంకా స్పష్టత లేదు. ఢిల్లీలో ఆందోళనలకు కారణమైన గ్యాంగ్‌స్టర్‌ లఖా సిధానా కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే దీప్‌ సిద్ధూను విచారించేందుకు సమన్లు జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.