న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టు, సీనియర్ ఎడిటర్లపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. తాజాగా ద వైర్ ఎడిటర్ సిద్ధార్ధ్ వరదరాజన్‌పై కూడా కేసు నమోదైంది. ట్రాక్టర్ ర్యాలీలో ఓ రైతు చనిపోయిన కథనాన్ని ఓ వెబ్ పోర్టల్ నుండి షేర్ చేయడంతో ఆయనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతి సమైక్యతకు ముప్పు వాటిల్లే విధంగా ఉండటంతో పాటు అల్లర్లు కలిగించేలా ఆయన చర్యలు ఉన్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు ... ఢిల్లీలోని ఐటిఒ వద్ద ట్రాక్టర్ ర్యాలీ చేపడుతుండగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఓ ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారని,మృతుడికి పోస్టుమార్టం నిర్వహించిన ఓ డాక్టర్ ఈ విషయాన్ని తమకు చెప్పాడని పేర్కొన్నట్లు వెబ్ పోర్టల్ కథనాన్ని రచించింది. ఈ విషయాన్నే సిద్ధార్ధ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే తాము కుటుంబ సభ్యులతో మాట్లాడలేదని వైద్యులు చెప్పారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై సిద్ధార్థ్ స్పందిస్తూ... మృతుడి తాత చెప్పినదాన్నే తాను ప్రస్తావించానని, అదే ట్వీట్ చేసినందుకు తనపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. కాగా, ఈయనతో కలిపి మొత్తం ఏడుగురు జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయి.










