Nov 01,2022 16:02

న్యూఢిల్లీ  :    'వైర్‌' మీడియా సంస్థ, ఎడిటర్‌ నివాసాలపై ఢిల్లీ పోలీసులు సోదాలు చేపట్టడాన్ని జర్నలిస్టుల సంఘం, ప్రతిపక్షాలు ఖండించాయి. వైర్‌ వ్యవస్థాపక సంపాదకులు సిద్దార్థ్‌ వరదరాజన్‌, ఎం.కె. వేణు, సిద్దార్థ్‌ భాటియా, డిప్యూటీ ఎడిటర్‌ జాహ్నవి సేన్‌, ఢిల్లీ-ముంబయి ప్రొడక్ట్‌ కమ్‌ బిజినెస్‌ హెడ్‌ మిథున్‌ కిదాంబి నివాసాలపై సోమవారం ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సోదాలు జరిపారు. అధికార బిజెపి ప్రతినిధి అమిత్‌ మాలవియా దురుద్దేశపూర్వకంగా చేసిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరిపారని, వారిపై జారీ చేసిన సెక్షన్‌ 91 నోటీసు ప్రకారం వివిధ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని జర్నలిస్ట్‌ సంఘాలు తెలిపాయి. ఢిల్లీలోని భగత్‌ సింగ్‌ నగర్‌లో ఉన్న వైర్‌ కార్యాలయంలో కూడా సోదాలు జరిపి, పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్యాలయం నుండి వైర్‌కి చెందిన న్యాయవాదిని పోలీసులు బలవంతంగా బయటికి నెట్టినట్లు పేర్కొన్నాయి.

స్వాధీనం చేసుకున్న పరికరాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని వైర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. వైర్‌ సంస్థ వద్ద ఉన్న రహస్య, సున్నితమైన సమాచారాన్ని స్వాధీనం చేసుకునేందుకు, తప్పుడు సమాచారం గా చూపేందుకు సాకుగా వినియోగించవచ్చని వెల్లడించింది. ఆఫీస్‌ వ్యవహారాలకు సంబంధించిన ఆ పరికరాల కాపీలు కూడా అందించలేదని తెలిపింది.

వైర్‌ తో పాటు 11 డిజిటల్‌ వార్తా సంస్థలను కలిగి ఉన్న డిఐజిఐపియుబి న్యూస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. పోలీసుల సోదాలు ద్వేషపూరిత ఉద్దేశాలకు చెంపపెట్టు అని పేర్కొంది. నకిలీ వార్తను ప్రచురించే జర్నలిస్టు లేదా మీడియా సంస్థ.. సహచరులకు, సమాజానికి జవాబుదారీగా ఉండాలని తెలిపింది. పోలీసులు సోదాలు చేపట్టడంతో మీడియా వద్ద ఉన్న రహస్య, సున్నితమైన సమాచారాన్ని స్వాధీనం చేసుకోవడానికి, తప్పుడు వార్తగా మలచడానికి ఈ సోదాలు ఓ సాకుగా వినియోగించే ప్రమాదాన్ని తోసిపుచ్చలేమని పేర్కొంది. ఏ న్యాయమైన విచారణ అయినా చట్టాలకు లోబడి ఉండాలి కానీ.. జర్నలిజాన్ని నేరపూరితం చేయాలనే ఉద్దేశంతో ఉండకూడదని సూచించింది. పోలీసుల విచారణ, వేధింపులు జర్నలిస్టులను వారి విధులు చేయకుండా బెదిరింపులకు గురిచేశాయని ఇటీవల అనేక సందర్భాల్లో నిర్థారణైందని పేర్కొంది.

వైర్‌ ఎడిటర్ల నివాసాలపై సోదాలు భారత ప్రభుత్వ మితిమీరిన చర్యగా కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సిపిజె) 'ఆసియా ప్రోగ్రామ్‌' కో ఆర్డినేటర్‌  బెహ్ లిహ్ యి పేర్కొన్నారు. మెటా, అమిత్‌మాలవియాపై నివేదికను వైర్‌ స్వచ్చంధంగా వెనక్కుతీసుకోవడంతో పాటు పాఠకులకు క్షమాపణలు తెలిపింది. నివేదికపై అంతర్గత సమీక్ష చేపడుతోందని, రాజకీయ నేతలు, అధికారులను వేధింపులను ఆపాలని కోరుతున్నామని సిపిజె పేర్కొంది.

ఢిల్లీ పోలీసుల సోదాలు అనైతికమని మీడియాలోని మహిళా నెట్‌ వర్క్‌ మండిపడింది. సోషల్‌మీడియాలోని ఇతర సంస్థలు ఈ సోదాలను ఖండించాయి. నేరపూరిత విచారణ పాత్రికేయ విలువల ఉల్లంఘనకు అసమానమని ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌కి చెందిన అపర్‌ గుప్తా పేర్కొన్నారు.