న్యూఢిల్లీ : ది వైర్ పోర్టల్ కార్యాలయం, న్యూస్ రూమ్, ఎడిటర్ల నివాసాల్లో ఢిల్లీ పోలీసుల సోదాలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోదాల్లో ఢిల్లీ పోలీసులు హద్దులు మీరారని, విపరీతంగా ప్రవర్తించారని, కేసుతో సంబంధం లేకుండా విచారణ జరిపారని విమర్శించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోలీసులు సోదాలు, డిజిటల్ వస్తువులను స్వాధీనం చేసుకున్న తీరు తీవ్రంగా కలవరపరిచిందని, ఇది దర్యాప్తు విధానాలు, నియమాల ఉల్లంఘన అని విమర్శించింది. కేసులను దర్యాప్తు చేయడంలో నిష్పాక్షికంగా, న్యాయంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి బెదిరింపు వ్యూహాలను అమలు చేయవద్దని ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. బిజెపి నాయకుడు అమిత్ మాల్వియా చేసిన క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదు మేరకు ది వైర్‌లో పోలీసులు ఆదివారం సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.










