ఇటువంటి చట్టాలను అమలు చేయడం ద్వారా భారత ప్రజలను శాశ్వతంగా దారిద్య్రం లోకి నెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దీంతో, 1995లో ప్రారంభమైన వ్యవసాయ సంస్కరణలు నేడు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ అంకం ముగిసిన తరువాత రైతు అనేవాడు దేశంలో కానరాడు. ఒకవేళ రైతును చూడాలనుకుంటే ఎగ్జిబిషన్‌లో పెట్టాల్సిందే !
కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగం పూర్తిగా కార్పొరేట్ పరం కావడానికి చివరి అంకానికి చేరినట్టు అయ్యింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో (1.1.1995) ప్రారంభమైన భారత వ్యవసాయ సంస్కరణలు ముగింపు దశకు చేరుకున్నాయి. భూముల నుంచి రైతులను బయటకు పంపించి కార్పొరేట్ల ద్వారా వ్యవసాయం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చర్యలు చేపట్టింది.
ఈ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏఐకెఎస్‌సిసి ఆధ్వర్యాన భారత రైతాంగం నవంబర్ 26 నుంచి ప్రత్యక్షంగా పోరాడుతున్నది. రైతులకు సంఘీభావంగా ట్రేడ్ యూనియన్లు, వైట్ కాలర్ యూనియన్లు, మహిళలు, యువకులు, విద్యార్థులు కూడా లక్షల సంఖ్యలో ఉద్యమిస్తున్నారు. ఇంతమంది వ్యతిరేకిస్తుండగా, దేశంలోని మెజార్టీ ప్రజలు ఆందోళనలో పాల్గొంటుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. రైతు ఉద్యమంలో రైతులు లేరనీ, ఉగ్రవాదులు ఉన్నారనీ, పాకిస్తాన్ ఏజెంట్లు దూరారనీ, ఆల్‌ఖైదా ఉగ్రవాదులు కూడా చేరారనీ బిజెపి మంత్రులతో సహా ప్రధాని కూడా ప్రత్యక్షంగా దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు. వాస్తవాలు పరిశీలించినప్పుడు దేశంలోని 21 ప్రధాన రాజకీయ పార్టీలు, 212 రైతు సంఘాలు, మొత్తం ట్రేడ్ యూనియన్లు, అనేక ప్రజా సంఘాలు ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నాయని తేలింది. చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని రైతులతో కమిటీ వేసి తామే పరిష్కరిస్తామని ముందుకు వచ్చింది. మొదట చట్టాలను ఉపసంహరించి ఆ తరువాత రైతు ప్రతినిధులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని రైతు నాయకులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
సంస్కరణల ఫలితంగా 1991-95లో ఉన్న ఎగుమతుల స్థితి 2010 వచ్చే నాటికి దిగుమతుల లోకి మారింది. 2014 నుంచి ఈ దిగుమతుల స్థాయి బాగా పెరిగింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడంతో ఎగుమతి ఆధారిత ఉత్పత్తులను పండించి... కార్పొరేట్లు లాభాలు చేకూర్చుకొని...ఆహార ధాన్యాలను దిగుమతులు చేసుకోవటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చట్టాలు రాగానే ఇందులో నిత్యావసర వస్తువుల చట్టం నుంచి తొలగించిన ముతక ధాన్యాల ధరలు, పప్పుల ధరలు, వంటనూనెల ధరలు, 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. కిలో రూ.65 ఉన్న పప్పు రూ.130కి పెరిగింది. రూ.80 ఉన్న వంటనూనెలు రూ.130కి పెరిగాయి. గత 6-7 సంవత్సరాలుగా దేశీయ వ్యవసాయ పరిశోధనలు మూసివేసి విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలో ప్రతి జిల్లాల్లో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ఈ మధ్య జయశంకర్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో 3 వరిధాన్యం, 1 పచ్చజొన్న, 1 కంది, 1 వేరుశనగ, 1 పత్తి, 1 నువ్వుల పరిశోధనలను 21.6.2019న ఆవిష్కరించారు. అయినా వీటి ప్రచారం చేయడంగానీ, వీటిని రైతులకు అందించడంగానీ కాలేదు. హైదరాబాద్ పట్టణానికి అత్యంత సమీపంగా ఇక్రిసాట్ పరిశోధనా కేంద్రం 3000 ఎకరాలలో వున్నప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. ఈ పరిశోధనలన్నీ అమెరికా, ఆస్ట్రేలియాలకు పంపిస్తున్నారు. భారత రైతాంగాన్ని వ్యవసాయ రంగం నుంచి తప్పించటానికి చివరి ప్రయత్నంగా ఇప్పుడీ చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ చట్టాలలో మొదటిది నిత్యావసర సరుకుల ఉపసంహరణ చట్టం కాగా, రెండవది రైతును కార్పొరేట్‌తో ఒప్పందం చేయించే చట్టం, మూడవది మార్కెట్లను రద్దు చేయించే చట్టం.
ప్రస్తుతం రిలయన్స్‌కు 17 ఉప కంపెనీలు ఉన్నాయి. అదానీకి 23, పతంజలికి 12, టాటా, బిర్లా, ఐటిసి, బేయర్ సంస్థలకు అనేక కంపెనీలు వున్నాయి. వీరంతా వీలైనంత త్వరగా భూములను రైతుల నుండి తమకు అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో నేడు అత్యంత ప్రధానంగా ఉన్న కార్గిల్ సంస్థ వ్యాపార ఆస్తులు 107 బిలియన్ డాలర్లు. కాగా, డూపాయింట్‌కు 16 బిలియన్లు, సిన్‌జెంట 13 బిలియన్లు, డీర్ కంపెనీ 18.50 బిలియన్లు, బిఎఎస్‌ఎఫ్ 6.55 బిలియన్లు, బేయర్ 12 బిలియన్లు, రిలయన్స్‌కు 54 బిలియన్ డాలర్ల ఆస్తులు వున్నాయి. ఇవి ఈ పెట్టుబడులను వ్యవసాయ రంగం లోకి తెచ్చి ఎగుమతి ఆధారిత పంటలను పండించి ప్రాసెస్ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసి లాభాలు సంపాదించాలన్న లక్ష్యంతో వున్నాయి. విచిత్రమేమిటంటే ధనిక దేశాలు తమ దేశాల లోని వ్యవసాయ రంగానికి నష్టం రాకుండా గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, అంబర్ బాక్స్‌ల పేరుతో లక్షల కోట్ల డాలర్లు రాయితీలు ఇస్తున్నాయి. సుంకమేతర ఆంక్షలు విధించి తమ దేశం లోకి దిగుమతులు రాకుండా రక్షణలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు భారత్-పాకిస్తాన్ అణు పరీక్షలు జరిపినందున ఆ దేశాల దిగుమతులను అంగీకరించలేదు. క్యూబాకు సహకరించే దేశాలకు కూడా దిగుమతి ఆంక్షలు పెట్టారు. అదే సందర్భంలో తమ ఉత్పత్తులను నిరాటంకంగా భారత దేశంలోకి దింపడానికి, భారత దేశాన్ని తమ దిగుమతి డంపింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలకు భారత ప్రభుత్వం దాసోహం అంటున్నది. చివరికి ఎగుమతి సబ్సిడీలు ఇవ్వనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికాలో 2019లో సంతకం చేసి వచ్చారు. అందువల్ల ప్రస్తుతం మన దేశం నుంచి క్రమ క్రమంగా వ్యవసాయ ఎగుమతులు అంతరిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులు, వాటి ఉప ఉత్పత్తులు విపరీతంగా దిగుమతి అవుతున్నాయి. కోళ్ళు, కోడి గుడ్లు, మాంసం, పసుపు, మిరప ఉత్పత్తిలో ప్రపంచం లోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. కోళ్ళ పరిశ్రమను దెబ్బ తీయటానికి 'బర్డ్ ఫ్లూ' రోగం భారత దేశంలో ప్రబలిందని లక్షలాది కోళ్ళను అకారణంగా చంపివేశారు. పాల ఉత్పత్తిని దెబ్బతీయటానికి మౌత్ డిసీజ్, బ్లూ టంగ్, మ్యాడ్ కౌ జబ్బులు వచ్చాయని ప్రచారం చేసి పాలు ఎగుమతి కాకుండా ఆంక్షలు పెడుతున్నారు. అసలు భారత ఉత్పత్తులను బయటకు వెళ్ళకుండా ఇన్ని ఆంక్షలు పెడుతున్నప్పటికీ మన పాలకుల్లో కనీసం దేశభక్తి, దేశాభిమానం కూడా కనబడడంలేదు. పైగా బయటి శక్తుల ఒత్తిడిని తట్టుకొని ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న ప్రజలను దేశ దోహ్రులని ముద్ర వేయడం ఆశ్చర్యకరంగా ఉంది. ఏటా భారత దేశంలో వ్యవసాయ రంగంలో 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా నివారణ గురించి పాలక వర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బయటి నుంచి వచ్చే ఒత్తిడికి తోడు దేశీయ కార్పొరేట్ల ఒత్తిడి కూడా తోడు కావడంతో పాలక వర్గం 'జో హుకుం' చట్టాలను తెచ్చి వారికి రక్షణలు కల్పిస్తున్నది.
పైన చెప్పిన వాస్తవాలన్నిటిని కేంద్ర ప్రభుత్వం తృణీకరించగలదా ? వాస్తవాలైతే నివారణ చర్యలు చేపడుతుందా? భారత ప్రజానీకాన్ని భూముల నుంచి తప్పించటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలలో భూ సంస్కరణల చట్టాలను మరుగున పెట్టారు. వాటికి సవరణలు తెచ్చి పెద్దలు భూములు ఆక్రమించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నారు. ఒక్కొక్కరు వేల ఎకరాల భూములను సమీకరిస్తున్నారు. ఇందుకు ప్రజలు తిరగబడకుండా... కేంద్రం చేస్తున్న చట్టాలు...వారికి ఉపయోగకరంగా ఉంటాయి. అటువంటి చట్టాలను అమలు చేయడం ద్వారా భారత ప్రజలను శాశ్వతంగా దారిద్య్రం లోకి నెట్టే ప్రయత్నం జరుగుతున్నది. కొందరు మేధావులు అనుకునే వారు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వాదనలు చేయడం సిగ్గుచేటు. 70 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం మనం ఎందుకు అభివృద్ధి కాలేకపోతున్నామనేది పాలకులు విశ్లేషించుకోవాలి. 1995లో ప్రారంభమైన సంస్కరణలు నేడు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ అంకం ముగిసిన తరువాత రైతు అనేవాడు దేశంలో కానరాడు. ఒకవేళ రైతును చూడాలనుకుంటే ఎగ్జిబిషన్‌లో పెట్టాల్సిందే! ఇంత ప్రమాదకరమైన చట్టాలను బలపర్చే వారిని ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి.
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు,
సారంపల్లి మల్లారెడ్డి

సెల్: 94900 98666)










