May 08,2023 11:43

జైపూర్‌  :    బిజెపి నేత వసుంధరా రాజెపై తన ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  వసుంధర రాజె నియోజకవర్గమైన ధోల్‌పూర్‌లో ఆదివారం  గెహ్లాట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2020లో సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటు సమయంలో తన ప్రభుత్వాన్ని కాపాడేందుకు వసుంధరా రాజె, మరో ఇద్దరు బిజెపి నేతలు సహకరించారని అశోక్‌ గెహ్లాట్‌ వ్యాఖ్యానించారు.

2020 జులైలో గెహ్లాట్‌పై అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలెట్‌తో పాటు అతని 18 మంది మద్దతుదారులు తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా జోక్యంతో నెల రోజుల అనంతరం సంక్షోభం ముగిసింది. తిరుగుబాటు ప్రకటించిన సచిన్‌ పైలెట్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం వేటు వేసింది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడి పదవుల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే ఆసమయంలో వసుంధరా రాజె, రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కైలాష్‌ మేఘవాల్‌, ఎమ్మెల్యే శోభారాణి కుష్వా తనకు అనుకూలంగా వ్యవహరించారని, తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి అధిష్టానం యత్నాలను ఈ ముగ్గురు వ్యతిరేకించారని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లు తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారని, ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపారని అన్నారు..

ఈ వ్యాఖ్యలను వసుంధరా రాజె తీవ్రంగా ఖండించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో గెహ్లాట్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గెహ్లాట్‌ తనను ప్రశంసించడం.. తనపై పన్నిన అతిపెద్ద కుట్ర అని అన్నారు. గెహ్లాట్‌ మాదిరిగా తనను ఇప్పటివరకు ఎవరూ అవమానించలేదని అన్నారు. తన ఎమ్మెల్యేలు లంచం తీసుకున్నట్లు గెహ్లాట్‌ వద్ద ఆధారాల ఉంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అన్నారు.