Mar 26,2023 21:15

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

 మదనపల్లె అర్బన్‌ : రైతు భరోసా కేంద్రాలు అలంకారప్రాయంగా మారిపోయాయని, ప్రకతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికార వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఆరోపించారు. ఆదివారం బెంగళూరు బస్టాండులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వడగళ్లతో కూడిన అకాల వర్షంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు తమ పంటలను నష్టపోయారన్నారు. రౖతు భరోసా కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బతిన్న పంటలపై నివేదిక రూపొందించకపోవడం శోచనీయమన్నారు. వడగళ్ల ధాటికి మామిడి, టమోటో వంటి ఉద్యానవన పంటలకు అపారమైన నష్టం వాటిలిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్మోహన్‌ రెడ్డి వారి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అనంతరం మైనార్టీ నాయకులు పఠాన్‌ ఖాదర్‌ ఖాన్‌, ఎస్‌.ఏ.మస్తాన్‌, నాగూర్‌ వలి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. వైసిపి అవలంభిస్తున్న విధానాలను రైతులు గమనిస్తున్నారని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వేమయ్య, షంషీర్‌, గిరీష్‌ కుమార్‌, ఇంతియాజ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.