కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం జూన్‌లో తెచ్చిన ఆర్డినెన్సులను పార్లమెంటు ద్వారా చట్టాలు చేసింది. ఆర్డినెన్సుల నాటి నుండే దేశంలోని 250 రైతు సంఘాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలూ వ్యతిరేకించాయి. 11 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ పార్లమెంటులో తనకున్న మందబలంతో ఆమోదింపచేసుకుంది. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా ఓటింగ్ జరపకుండానే చట్టం ఆమోదించినట్లు ప్రకటించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోది అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులన్నిటినీ కాలరాస్తోంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్ రైతాంగం ఎడల కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోంది.
నిత్యావసర సరుకుల చట్టం
నిత్యావసర సరుకుల చట్టం నుంచి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెలు, నూనె గింజలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను మినహాయించింది. ఆహార ధాన్యాల ధరలు 50 శాతం పైగా పెరిగినప్పుడు... పండ్లు, కూరగాయలు, పూలు, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటల ధరలు వంద శాతం పైగా పెరిగినప్పుడు మాత్రమే...ప్రభుత్వం కలుగజేసుకుంటుందని పేర్కొంది. ఈ నిబంధన కూడా ఎగుమతి దిగుమతి వ్యాపారులకు, ఆహార అనుబంధ పరిశ్రమలకు, రిలయన్స్, వాల్‌మార్ట్ వంటి హోల్‌సేల్ సంస్థలకు మినహాయింపు ఇచ్చింది. వీరంతా ఎంత సరుకైనా కొని నిల్వ చేసుకుని ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఈ చట్టం ద్వారా బ్లాక్ మార్కెట్ చట్టబద్ధం అయింది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆహార భద్రతకు తిలోదకాలు ఇచ్చింది.
వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం
ఈ చట్టం ప్రకారం రైతులు తమ పంటలను రాష్ట్రాలు దాటి ఎక్కడికైనా తీసుకువెళ్లి ఎవరికైనా అమ్ముకోవచ్చు. వాస్తవానికి స్వేచ్ఛ వచ్చింది రైతుకు కాదు. బహుళజాతి కంపెనీలకు, ఎగుమతి దిగుమతి వ్యాపారులకు. బడా హోల్‌సేల్ కంపెనీలకు మాత్రమే. వారంతా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా కోట్ల రూపాయల సరుకైనా కొని లాభాలు వచ్చే ప్రాంతాలకు తరలించవచ్చు. వారికి ఇకపై ఏ మార్కెట్ చట్టాలూ వర్తించవు. రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ ఉండదు. ఇప్పటి వరకు రైతుల ప్రయోజనాల కొరకు పని చేస్తున్న వ్యవసాయ మార్కెట్లు, వాటి చట్టాలు కొరగాకుండా పోతాయి. ఇప్పటి వరకు రైతులు పంటలు కొనుగోలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వీర్యం అయిపోతాయి.
రైతు సాధికారత పంటల ధరలు సేవల చట్టం
ఈ చట్టం ప్రకారం రైతు వ్యక్తిగతంగా గాని గ్రూపుగా గాని తనకిష్టమైన కంపెనీతో అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. అగ్రిమెంట్ ప్రకారం దుక్కి దున్నే ట్రాక్టర్ నుండి కోత కోసే హార్వెస్టర్ వరకు యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు అన్నీ... కంపెనీలు అంగీకరించినవే ఉపయోగించాలి. వాటన్నిటిలోనూ వారికి వాటాలు వుంటాయి. వారికి లాభాలు వస్తాయి. అగ్రిమెంట్‌లో రాసుకున్న ప్రకారం రైతులు పండించిన పంటలను సకాలంలో, నాణ్యత ప్రమాణాలతో, ఆహార భద్రత ప్రమాణాలతో, అంగీకరించిన గ్రేడ్లలో సరఫరా చేయాలి. ఏ లోపం జరిగినా వారికి ఇచ్చే రేటు తగ్గించవచ్చు, అగ్రిమెంట్ లోనే పంటకు చెల్లించే ధర నిర్ణయిస్తారు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలతో సంబంధం లేదు. స్వామినాథన్ కమిషన్ సూచనలతో సంబంధం లేదు. ఒకసారి అగ్రిమెంట్ రాసుకున్న తరువాత మార్కెట్లో ధరలు పెరిగినా పెరిగిన ధరలు రైతుకు రావు. గ్రేడ్లు, ప్రమాణాల పేరుతో ధరలు తగ్గించడానికి చట్టం వీలు కల్పిస్తుంది.
వివాదాలు-పరిష్కారాలు
రైతులకు కంపెనీలకు వ్యాపారులకు వివాదం వస్తే కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. ఆర్డీవోకు అప్పీలు చేసుకోవాలి. రైతు లాయర్ని పెట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ తీర్పు నచ్చకపోతే కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చు. చట్టం ప్రకారం రూ. పది వేల నుండి రూ. పది లక్షల వరకు ఫెనాల్టీ వేయవచ్చు. ప్రభుత్వాన్ని శాసించగల కార్పొరేట్ కంపెనీలు ఏమైనా చేయగలవు. కంపెనీల యజమానులైతే ఎగ్గొట్టి విదేశాలు పారిపోగలరు. రైతు ఎక్కడికి వెళ్ళగలడు. రైతు తన భూమిని వదిలి ఎటూ పోలేడు. ఆత్మహత్యలు సైతం తన భూముల్లోనే చేసుకోవడం చూస్తున్నాం.
గత అనుభవాల గాయాలు
కార్పొరేట్ వ్యవసాయం కొత్తది కాదు. సుబాబుల్, చెరకు, పామాయిల్, విత్తనాలు, బంగాళదుంపలు ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయి. సుబాబుల్ కర్రను రూ. 4300లకు కొనాలని ప్రభుత్వం, ఐటీసీ కంపెనీ, రైతులకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉన్నప్పటికీ టన్ను రూ. రెండు వేలకు మించి కొనడం లేదు. రైతు చెరుకు తోలిన 15 రోజులలో పైకం ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ నేడు దేశంలో రూ.30 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. కుప్పంలో ఇజ్రాయిల్ కంపెనీ నిర్వహించిన వ్యవసాయ భూములు పనికి రాకుండా చేసి వెళ్లిపోగా భూములు సాగు లోనికి రావడానికి దశాబ్ద కాలం పట్టింది. విత్తనాలు పండించే రైతులు కంపెనీలతో పడుతున్న ఇబ్బందులు ఏటా చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కిలో పెసలు ధర రూ. 72 రిలయన్స్ రిటైల్‌లో రూ.170 లకు, మినుములు కిలో ధర రూ.60 కాగా మినప గుళ్ళు రూ. 200 లకు అమ్ముతున్నారు. పండించే రైతుకన్నా కార్పొరేట్ సంస్థలు ఎన్నో రెట్లు లాభాలు తీస్తున్నాయి. అయినప్పటికీ ప్రధానమంత్రి మొదలు బిజెపి నాయకులందరూ ఈ చట్టాల వల్ల రైతులకు స్వాతంత్య్రం వచ్చిందని, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని మోసపూరిత ప్రచారం చేస్తున్నారు.
2020 విద్యుత్ సవరణ చట్టం
కేంద్ర ప్రభుత్వం పై చట్టాలకు తోడు విద్యుత్ సవరణ చట్టం చేసింది. దీని ప్రకారం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ ప్రైవేటు వారికి చౌకగా అప్పగించడానికి, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులైన రిలయన్స్, అదానీ వంటి కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా విద్యుత్ చార్జీలు నిర్ణయించాలని పేర్కొంది. 20 శాతానికి మించి సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయించింది. వ్యవసాయానికి వినియోగించే మోటార్లు అన్నింటికీ స్మార్ట్ మీటర్లు బిగించాలని, రీడింగ్ ప్రకారం ఏ నెలకా నెల ముందుగానే బిల్లులు చెల్లించే పద్ధతి పెట్టాలని, ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకం పెట్టుకోవాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని 11 రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. రైతు సంఘాలు వ్యతిరేకించాయి.
రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు
మన రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించడానికి అంగీకరించింది. 22 జీవోను విడుదల చేసింది. రైతుల వద్ద దరఖాస్తులు తీసుకునే పని ప్రారంభించింది. రైతుల బిల్లులు తామే చెల్లిస్తామని చెప్తుంది. బిల్లు తామే చెల్లించేటప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకన్న దానికి సమాధానం లేదు. ఒకసారి మీటరు బిగిస్తే అది శాశ్వతంగా రైతు మెడకు ఉరితాడే. పొరుగు రాష్ట్రాలు అన్నీ వ్యతిరేకించినా మన రాష్ట్రం అమలుకు పూనుకున్నది. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన అన్ని రైతు వ్యతిరేక చట్టాలను మన రాష్ట్ర ప్రభుత్వం బలపరుస్తూ పార్లమెంటులో ఓటు వేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంటులో బిల్లులకు అనుకూలంగా ఓటు వేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించకుండా లొంగుబాటు ప్రదర్శిస్తున్నాయి.
బిజెపి ప్రభుత్వ మోసపూరిత విధానం
2014 ఎన్నికలలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సి2+50 ఫార్ములా ప్రకారం పంటలకు ధరలు ఇస్తామని, రైతును రుణ భారం నుండి విముక్తి చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. అధికారం లోకి వచ్చాక ఆ హామీలకు తిలోదకాలిచ్చింది. ప్రధానమంత్రి అన్నదాత ఆదాయ సంరక్షణ యోజన ఎ2+ఎఫ్‌ఎల్ ధరల విధానం వంటి వాటితో మోసగించే ప్రయత్నం చేసింది. అవి విఫలం కావడంతో పంటల మద్దతు ధరల చట్టం కోసం, రుణ విమోచన చట్టం కోసం 250 రైతు సంఘాలు పోరాటం సాగిస్తూ వచ్చాయి. రైతులు కరోనా కష్ట కాలంలో అనేక విధాలుగా నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో రైతాంగానికి ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడు ఏకంగా 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూనే రెండవ వైపు మొత్తం వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడానికి ఈ చట్టాలు చేసింది. వీటికి వ్యతిరేకంగా రైతు సంఘాలు పోరు బాట పట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు మద్దతు ఇస్తున్న సంఘాలు సైతం పోరాటం లోకి వస్తున్నాయి. నేడు 500 రైతు సంఘాలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడు తున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా ఈ నెల 26న గ్రామగ్రామాన హర్తాళ్ జరపాలని, 27న జిల్లా కేంద్రాల్లో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర ధర్నాలు జరపాలని నిర్ణయించాయి.
* వై. కేశవరావు (ఎ.పి రైతు సంఘం అధ్యక్షుడు)










