- సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ
ప్రజాశక్తి-మైలవరం: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు స్థానిక ఏఎంసీలో తడిసిన మొక్కజొన్న, ధాన్యాన్ని మంగళవారం సిపిఎం, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. మొక్కజొన్న, ధాన్యాన్ని ఎంతవరకు కొంటున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల నుండి ఏఎంసిలోనే ఉంటున్నామని, అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని, దళారుల ప్రమేయం ఎక్కువగా ఉందని పలువురు రైతులు నాయకులు వద్ద వాపోయారు. అనంతరం రైతులతో కలిసి ఏఎంసి వద్ద జాతీయ రహదారిపై నిరసన చేసేందుకు నాయకులు వెళ్తుండగా మైలవరం సిఐ మోహన్‌రెడ్డి తన సిబ్బందితో అడ్డుకున్నారు. పోలీసులకు, నాయకులకు గంటసేపు వాగ్వాదం జరిగింది. మొక్కజొన్న, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, పత్తాలేని అధికారులు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డి.వి.కృష్ణ మాట్లాడుతూ రైతులు తెచ్చిన పంటను సకాలంలో కొనేవారు లేకపోవడంతో మొక్కజొన్న, ధాన్యం తడిచాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రైతు పండించిన పంటకు రక్షణ కరువైందన్నారు. రైతులు తమ పంటలను తడవకుండా ఏఎంసిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండగా దానికి విరుద్ధంగా ఐరన్‌ను నిల్వ ఉంచటం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతుకు న్యాయం జరగాలని కోరారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి గింజను ఆర్‌బికె ద్వారా కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదన్నారు. ఆర్‌బికె అధికారులు, దళారులు కుమ్మక్కై కమీషన్ల కోసం రైతులను మోసం చేస్తున్నారన్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు రాక రైతులకు ఆత్మహత్యలే తప్ప మరో మార్గం లేదన్నారు. అనంతరం ఏఎంసి కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో ఉన్న సిబ్బందిని కూడా బయటికి పంపించి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు వెంటనే రావాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విషయాన్ని కలెక్టర్ ఢిల్లీరావు దష్టికి నాయకులు తీసుకెళ్లగా ఆయన స్పందించి వెంటనే మార్క్‌ఫెడ్ ఏడిఎం కిషోర్‌ను మైలవరం ఎఎంసి వద్దకు పంపించారు. సిపిఎం, రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని, మొక్కజొన్నను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, రైతులందరికీ టార్ఫాలిన్ పట్టాలు ఇవ్వాలని, దళారులను ఏఎంసికి రాకుండా నిలువరించాలని, ఏఎంసిలో నిల్వ ఉంచిన ఐరన్ వెంటనే తీసేయాలని నాయకులు కోరారు. దీనిపై స్పందించిన ఎడియం నాలుగు రోజుల్లో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎడియం ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి రావూరి రమేష్‌బాబు, సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, రైతు సంఘం నాయకులు ఇసాక్, నాగేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి, సురేష్, మోహన్‌రావు, శేషయ్య పాల్గొన్నారు.










