మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రాష్ట్రంలో వైసిపి నియంతృత్వపాలన
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ప్రజాశక్తి-నెల్లూరు:అంగన్‌వాడీలు, ఆశాలు, సర్పంచ్‌లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరసనలను పోలీసుల సహాయంతో భగం చేస్తూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఒక నియంతృత్వపాలన సాగిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నిర్మాణ మహాసభలకు హాజరైయ్యేందుకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగేతర పద్దతులను అనుసరిస్తూ, ఒక అరాచక పరిపాలన సాగిస్తున్నాయన్నారు. అధికారం శాశ్వితం కాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల మద్దతుతోనే రాష్ట్రంలో వైసిపి నాయకులు దుర్మార్గంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, ఇది టిడిపి, జనసేన నాయకులు గుర్తించాలన్నారు. ప్రధాని నరేంద్రమోడి, హౌంశాఖ మంత్రి అమిత్‌షా ఇద్దరి సహకారంతోనే రాష్ట్రంలో వైసిపి దుర్మార్గమైన పాలన సాగిస్తుందన్నారు.గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు పరిపాలన, నేటి ప్రభుత్వ పాలనలు చూస్తే రాచరికంలో ఉన్నామా..ప్రజాస్వామపాలనలో ఉన్నామా అన్న అనుమానం వచ్చే పరిస్థితి క్లీయర్‌గా కనిపిస్తుందన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం ప్రతిపక్షాలను సహించే పరిస్థితి కనిపించడం లేదని, ప్రతిపక్షాలను కించపరిచే విధంగా ప్రధాని వ్యవహరిస్తున్నారన్నారు. అగ్రిగోల్డు బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారంలో ఉన్న ప్రభుత్వాలను క్రమం తప్పకుండా కలుస్తున్నారని, వినతిపత్రాలు అందజేయడం, ర్యాలీలు నిర్వహించడం, దీక్షలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ వారి సమస్య నేటికి పరిష్కారం కాలేదన్నారు. టిడిపి పాలనలో అగ్రిగోల్డు బాధితులు ఇటువంటి కార్యక్రమాలను చేశారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అగ్రిగోల్డు బాధితుల సమస్యను పరిష్కరిస్తామంటూ హామీలు సైతం ఇచ్చారన్నారు. వైసిపి నాయకులు దానిని ఆసరాగా తీసుకొని వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కారం చేయకపోతే అగ్రిగోల్డు బాధితులు జింకానా గ్రౌండ్స్ దీక్షలు చేస్తేమంటే అందుకు ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. ధర్నా చౌక్‌లో దీక్షలు చేసుకోవాలని వైసిపి ప్రభుత్వం చెప్పినప్పటికీ చివరి నిమిషంలో అక్కడ కూడా చేసేందుకు అనుమతిచ్చేందుకు నిరాకరించింది. చివరకు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో అగ్రీగోల్డు బాధితులు హాల్ మీటింగ్ పెట్టుకుంటే అందకు ప్రభుత్వం అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా చౌక్‌లో దీక్షలకు అనుమతి లేదన్నారు..కనీసం హాల్ మీటింగ్‌కు అనుమతి ఇవ్వకుండా సిపిఐ కార్యాలయం చుట్టూ పోలీసుతో దిగ్బందనం చేశారన్నారు. ప్రజాస్వామంలో ఉన్నామా.. లేక నియంత రాజ్యంలో ఉన్నామా అర్ధం కావడం లేదన్నారు. నియంతలు మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తారన్నారు. రోడ్డులో ధర్నా వద్దన్నారు.. ర్యాలీ వద్దన్నారు కనీసం హాల్ మీటింగ్ పెట్టుకొనేందుకు సైతం అంగీకరించకపోవడం దారుణమన్నారు. విద్యుత్తు కార్మికులు ర్యాలీ చేస్తుంటే ఆధార్‌కార్డులు తీసుకోవడం, సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించడం, అడ్రస్సులు తెలియజేయాలన్నారని, విజయవాడలో ప్రజలు స్వేచ్చగా ర్యాలీ చేసేందుకు, ధర్నా చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వదా అని ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఏమైనా మార్పు చేశారా.. వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగం వర్తించదా..అని ప్రశ్నించారు. అంగన్‌వాడీలు, ఆశాలు, ఉపాధ్యాయులు, సర్పంచులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పద్దతిలో, అత్యంత అప్రజాస్వామికంగా ప్రభుత్వ పాలన సాగిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల పట్ల అయితే అధికార ప్రభుత్వాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు అరెస్టు తీరును ఆయన ఖండించారు. సిబిఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని పిలిస్తే , గైర్హాజరై ఉన్నా..విచారణకు సహకరించకపోయినా..అరెస్టు చేయాలి కాని, నోటీసులు అందజేయకుండా , విచారణకు పిలవకుండా మీరు పెరు ఉందని, అరెస్టు చేస్తున్నాం అంటూ నంద్యాలకు అర్ధరాత్రి వెళ్ళి సరికాదన్నారు. చట్టం అందరికీ సమానమే అయినప్పటికీ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వానికి మాత్రం ప్రత్యేకమైన చట్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. సిబిఐ అధికారులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఒకటి రెండు సార్లు విచారణ చేసి అనంతరం అరెస్టు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దారుణంగా తయారైందన్నారు. ఎంపి అవినాష్‌రెడ్డి నాలుగు రోజులు హాస్పిటల్‌లో ఉన్న సమయంలో సిబిఐ అధికారులు అరెస్టు చేసేందుకు వెళ్తే పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, అరెస్టు చేయడం కష్టమని చెప్పడం హాస్యంగా ఉందన్నారు. ఒక ఎంపిని అరెస్టు చేయలేక పోయిన సిబిఐ అధికారులు ప్రతిపక్ష నాయకుడిని మాత్రం అరెస్టు చేయగలిగారన్నారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని,ఇదే విధంగా జరిగితే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఎవరికీ ఉండదన్నారు. జైలులో ఉన్న ప్రతిపక్షనాయకుడి భార్య కలిసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం మరీ దారుణమన్నారు. వైసిపికి రాష్ట్ర ప్రజలు మంచి అవకాశం ఇచ్చారని, దానిని ఎడమ కాలితో తన్నుకుంటూ తన గోయ్యను తానే స్వయంగా తొవ్వుకుంటున్నారన్నారు. నీ వ్యవహార శైలీ కరెక్టుగా లేదన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌ను అరెస్టు చేశారని, రాష్ట్రమేమైనా వైసిపి జాగీరా అని ప్రశ్నించారు. 17,18 తేదిలల్లో 26 జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను, పౌరహక్కుల సంఘాలను, విద్యార్ధి యువజన సంఘాలను కలుపుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ పరిరక్షణ కోసం రౌండ్‌టేబుల్ సమవేశాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రభుత్వానికి చివరి సారిగా హెచ్చరిక చేస్తున్నట్లు తెలిపారు. సిపిఐ కార్యాలయానికి పోలీసులను పంపి నిర్భందిస్తావా..అగ్రి గోల్డు బాధితులు తమ పార్టీ కార్యాలయానికి రాకూడదని ఏమైనా చట్టం ఉందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య , నగర కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు.










