Feb 14,2023 21:35

ఫొటో : మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బా నాయుడు

రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువు
ప్రజాశక్తి-కావలి : రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రానాలకు రక్షణ లేకుండా పోయిందని కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ''జగనాసుర రక్తచరిత్ర''ను వెల్లడించారు. వై.ఎస్‌.వివేకానందరెడ్డిని అతి క్రూరంగా గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన జరిగి నాలుగు సంవత్సరాల కాలమైనా ఇప్పటికీ నిందితులను ఎందుకు శిక్షించలేదో అర్థం కావడంలేదన్నారు. వివేకా హత్య జరిగిన రాత్రి మూడు గంటల సమయంలో పిఎ నవీన్‌ సమక్షంలో సిఎం, ఆయన భార్య, అవినాష్‌ రెడ్డితో మాట్లాడింది వాస్తవమా.. కాదా.. అని ప్రశ్నించారు. సిఎంలో నిజాయతీ ఉంటే కాల్‌ డేటాను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ హత్యా రాజకీయాలు పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అదేవిధంగా కావలి ఆర్‌డిఒ, కావలి మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా కొనసాగుతూ సోమవారం మాట్లాడిన మాటలు వాస్తవంగా ఉన్నాయని, ఇప్పటివరకు కావలి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని ఒప్పుకున్నందుకు వారిని మెచ్చుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా అభివృద్ధిలో కుంటుపడిన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో సాగించేందుకు కృషి చేయాలని సూచించారు. కావలి మున్సిపల్‌ కమిషనర్‌ రూ.15 కోట్లు దండి ఎవరికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక సామాన్యుడు తుమ్మలపెంట రోడ్డు గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినందుకు గానూ అతనిని పోలీసులు అరెస్టు చేసి రోజంతా కస్టడీలో ఉంచడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు. కావలి పట్టణంలో ఎక్కడో ఒకచోట దోమల మందు చల్లి పట్టణమంతా శస్యశ్యామలంగా ఉందనడం ఎంఎల్‌ఎ విజ్ఞతకే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా పట్టణంలో ఉన్న అపరిశుభ్రతపై దృష్టి సారించి కావలికి కొంతైనా మంచి చేయమని ఎంఎల్‌ఎను కోరారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యనిర్వాక కార్యదర్శి షేక్‌ మస్తాన్‌, కార్యదర్శి ఖాదర్‌బాషా, రాష్ట్ర బిసి సెల్‌ అధికార ప్రతినిధి బాల గురుస్వామి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి తటవర్తి వాసు, నియోజకవర్గ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్‌ కుమార్‌ చౌదరి, పట్టణ రైతు విభాగం అధ్యక్షులు చిట్టబత్తిన మాల్యాద్రి తదితరులున్నారు.