హిందూపురం : రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని స్థానిక జిల్లా జడ్జి శైలజ సూచించారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నపాటి వివాదాలకు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగి వ్యయప్రయాసాలకు గురి కాకుండా రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. అందుకోసమే లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామన్నారు. కాగా హిందూపురం రూరల్ మండల పరిధిలోని వీరంపల్లిలో గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన రహదారి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా మెగా లోక్ అదాలత్ లో మూడు బెంచ్ లను ఏర్పాటు చేసి 184 కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు స్పందన, రాజ్యలక్ష్మి, ఎపిపి నగేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగప్ప, కార్యదర్శి సుదర్శన్, లోక్ అదాలత్ సభ్యులు సిద్ధూ, కళావతి, కృష్ణమూర్తి, పార్వతి, ఫణి భూషణ్, చెన్నప్ప, లోక్ అదాలత్ శారద, హేమావతి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : రాజీ మార్గంతో ప్రశాంత జీవనం సాగించాలని సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం లోక్‌అదాలత్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి మాట్లాడుతూ గ్రామాల్లో అనేక మంది క్షణి కావేశానికి లోనై కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గ్రామాలలో అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. కేసుల్లో ఇరుక్కుని జైలుపాలైతే కుటుంబ సభ్యుల పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించాలన్నారు. అనంతరం పలుకేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. మొత్తం 330 కేసులను పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోషియేషన్ సీనియర్ న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.
కదిరి అర్బన్ : రాజీ మార్గంతోనే కేసులు పరిష్కరించుకోవాలని సీనియర్ న్యాయమూర్తి, లోక్ అదాలత్ చైర్మన్ వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం స్థానిక న్యాయస్థానం ఆవరణంలో లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలతో కేసుల్లో ఇరుక్కుని ప్రశాంతత వాతావరణాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి వారందరూ లోక్‌అదాలత్‌లో తమ సమస్యలను రాజీమార్గంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి ప్రతిమ, అడిషనల్ సివిల్ జడ్జ్ మీనాక్షి సుందరి, ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ షఫీవుల్లా, న్యాయవాదులు లింగాలలోకేశ్వర్ రెడ్డి ,నరసింహులు, సిఐ తమ్మిశెట్టి మధు, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










