Oct 15,2020 07:04

           అమరావతి లోనే రాజధాని కొనసాగాలని...రైతు, కూలీలకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని...జరుగుతున్న ఉద్యమానికి 300 రోజులు నిండాయి. మళ్లీ అమరావతిపై చర్చ, రచ్చ జరుగుతూనే వుంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఉద్యమం పైన, ఉద్యమకారుల పైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు చౌకబారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అమరావతి ఉద్యమం ప్లాప్‌ అయిందని మంత్రులు ఎత్తి పొడుస్తున్నారు. ఉద్యమం కాదు రాజధానిపై నేటి, గత పాలకుల విధానాలే ప్లాపయ్యాయి.
రాజధాని విచ్ఛిన్నంలో తొలి ముద్దాయి బిజెపినే
       రాజధానిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో నేడు, గతంలో అధికారంలో ఉన్న వైసిపి, టిడిపిల విధానాలు లోపభూయిష్టమైనవని మరోసారి అవగతమైంది. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని మోడీ మాట ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఆరేళ్లలో కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. నయా పైసా కేటాయించలేదు. అమరావతి అంగుళం కూడా కదలదని బిజెపి నేతలు ప్రకటించిన కొద్ది రోజులకే రాజధానితో మాకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున ఒకటికి మూడు సార్లు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. రాజధానికి నిధులు లేవు. రాజధాని విషయంలో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయకూడదు. కానీ అమరావతి రాజధానికి మోడీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో టిడిపితో బిజెపి జతకట్టి మంత్రివర్గంలో ఉన్నది. భూ సమీకరణ చట్టానికి, రాజధాని నిర్ణయానికి వీరిద్దరిది ఉమ్మడి బాధ్యత. ఆ నైతిక బాధ్యత నుండి తప్పుకొని బిజెపి వారు వంద నాలుకలతో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో నాటకం ఆడుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం వత్తాసునిస్తోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగాలంటున్న టిడిపి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న వైసిపి అమరావతికి, వెనుకబడిన ప్రాంతాలకు ద్రోహం చేస్తున్న కేంద్ర బిజెపి విధానాలపై ప్రశ్నించడం లేదు. పైపెచ్చు కుమ్మక్కు అవుతున్నాయి. పార్లమెంటులో అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులకు ఈ రెండు పార్టీలు గుడ్డిగా ఆమోదముద్ర వేస్తున్నాయి. అమరావతి ఉద్యమకారుల్లో కొందరు అమరావతిని కాపాడుతారనే భ్రమతో మోడీ బొమ్మలతో ఆందోళన చేశారు. బిజెపి ద్రోహాన్ని సిపిఎం ఆనాడే ప్రజల ముందుంచింది. అయోధ్య రామాలయం తరహాలో అమరావతిలో రామాలయం పెడతామని బిజెపి నేతలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే ప్లేటు ఫిరాయించారు. బిజెపి ద్వంద్వవైఖరి బహిర్గతం అయింది. ఇప్పుడే అమరావతి ఉద్యమకారుల్లో బిజెపిపై భ్రమలు తొలుగుతున్నాయి. అమరావతి, రాష్ట్ర అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ద్రోహం చేయటంలో తొలి ముద్దాయి బిజెపి, కేంద్ర ప్రభుత్వమే. ఆ బిజెపితో ప్రత్యక్షంగా జతకట్టిన జనసేన, పరోక్షంగా కుమ్మక్కు అవుతున్న వైసిపి, టిడిపిలు ముద్దాయిలే.
పాలకులందరిది ఒకటే దారి
         అమరావతి రాజధాని టిడిపి సొంతం అయినట్టు, వికేంద్రీకరణ-వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వైసిపి సొంతమైనట్లు ప్రాంతాల పరంగా, సామాజిక తరగతుల వారీగా, పార్టీల వారీగా ప్రజల మధ్య చీలికలు తెచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వారికి టిడిపి ముద్ర వేస్తున్నారు వైసిపి వారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన రాజధాని పూలింగ్‌ చట్టం తప్పు అని సిపిఎం నేతలు చెబితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారనీ, వైసిపితో జత కట్టారని ఆనాడు టిడిపి వారు విమర్శలు చేశారు. రాజధాని అమరావతి భూసమీకరణ ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. చంద్రబాబును చూసి భూములు ఇచ్చారని కితాబు ఇచ్చారు. ఎంతోమంది నిజమని నమ్మారు. ఈ పూలింగ్‌ తక్షణం లాభం జరిగినట్లు కనపడినా దీర్ఘ కాలంలో నష్టమేనని ఆనాడే సిపిఎం, కొన్ని వామపక్షాలు చెప్పాయి. ఆనాడు కొందరు రైతులు, టిడిపి వారు వామపక్ష నేతలను అడ్డుకున్నారు. కానీ అదే రైతుల్లో కొందరు ఆశపడి భూములు ఇచ్చి మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. వామపక్ష నేతలను ఆనాడు అడ్డుకుని తప్పు చేశామని, వారి మాట వినక నష్టపోయామని కొందరు రైతులు ఈ ఉద్యమ సందర్భంగా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. భూ సమీకరణ విఫలమైందని 300 రోజుల ఉద్యమం మరోసారి రుజువయ్యింది. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. కూలీలకు, పేదలకు, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. పూలింగ్‌ చట్టంలో మూడు సంవత్సరాల్లో ప్లాటు అభివృద్ధి చేస్తామని చెప్పిన టిడిపి నాలుగేళ్లలోను పూర్తిచేయలేదు. నేడు వైసిపి అసలు రాజధానికే ఎసరు పెట్టింది. రాజధాని లేకుండా ప్లాట్లు ఇస్తే ప్రయోజనం ఏముందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గతంలో భూ సమీకరణ వ్యతిరేకించిన వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో ఇళ్ల స్థలాల పేరుతో 6 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ బలవంతంగా చేయడానికి ప్రయత్నించింది. దళితులు వెనుకబడిన కులాల అసైన్డ్‌ భూములను గత టిడిపి ప్రభుత్వం తరహాలోనే వైసిపి పభుత్వం లాక్కుంటున్నది. గతంలో రాజధానికి పరిమితమైన భూ సమీకరణను వైసిపి ప్రభుత్వం రాష్ట్రం మొత్తానికి విస్తరింపచేస్తూ జీవోలు జారీ చేసింది. భూసేకరణ చట్టాన్ని బిజెపి నీరుగార్చింది. ఈ ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో వైసిపి, టిడిపి, బిజెపిలదీ ఒకటే దారి. సిపిఎం, ప్రగతిశీల శక్తులు మాత్రమే ల్యాండ్‌ పూలింగ్‌ వల్ల నష్టం అని అప్పుడు, ఇప్పుడు చెబుతున్నాయి.
పాలకులు మారినప్పుడల్లా రాజధాని మారాలా?
మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు అసెంబ్లీలో ఉన్న టిడిపి, బిజెపితో పాటు వైసిపి, ఆనాటి ప్రతిపక్షనేత జగన్‌ సంపూర్ణంగా బలపరిచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అమరావతిని తాము గత ప్రభుత్వం కంటే బాగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. గెలిచాక అమరావతిపై మాట మార్చారు. మడమ తిప్పారు. ఒకసారి ఏకాభిప్రాయం వచ్చి నిర్ణయించిన రాజధానిని ఇప్పుడు ఎందుకు మార్చాలి? ఒక రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వనప్పుడు, మూడు రాజధానులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా? అసెంబ్లీ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఒక దగ్గర ఉండటమే పరిపాలనకు సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం. కర్నూల్‌లో హైకోర్టు నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అభ్యంతరం లేదు కాని రాజధాని మాత్రం అమరావతి లోనే కొనసాగాలని సిపిఎం కోరింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు అందుబాటులో దూరంలో ఉంది. ఇష్టమో కష్టమో 34 వేల ఎకరాల భూములు రాజధాని కోసం రైతులు ఇచ్చారు. భూ సమీకరణ చట్టం పేరుతో చట్టబద్దమైన హామీలు రైతులకు, పేదలకు అందరికీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం వలన ప్లాట్లకు విలువ పెరుగుతుందని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ఉపాధి దొరుకుతుందని చట్టబద్ధంగానే పేర్కొన్నారు. శాసన రాజధాని అమరావతి లోనే కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతున్నా అభివృద్ధి పనులన్నీ ఆపేసింది. పూర్తయిన నిర్మాణాలు, ప్రజాధనం వృథా అవుతోంది. చట్టబద్ధమైన ఒప్పందాలను ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలకులే ఉల్లంఘిస్తే ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది.
చంద్రబాబు ప్రభుత్వం రాజధాని, దాని చుట్టూ అభివృద్ధి అంటూ, నవనగరాలు అంటూ ప్రజలలో ఆశలు రేకెత్తించింది. భ్రమలు కల్పించింది. అద్భుత రాజధాని అంటూ మోడీ ప్రజల సెంటిమెంటును ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. నేటి వైఎస్సార్‌ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల్లో ప్రజలను మభ్యపెట్టే పనిలో నిమగం అయ్యింది. మూడు ప్రధాన పార్టీలు రాజధాని చుట్టూనే రాష్ట్ర రాజకీయాలను తిప్పుతున్నాయి. అభివృద్ధి మొత్తం దాని చుట్టూనే ఉంటుందని ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నాలు చేశాయి, చేస్తున్నాయి. అభివృద్ధి కేంద్రీకరణ మంచిది కాదని, వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కావాలని సిపిఎం, వామపక్షాలు ఎప్పుడూ చెబుతున్నాయి, పోరాడుతున్నాయి.
        కరోనా ముప్పు, ఆర్థిక కడగండ్లకు తోడు తాజాగా అధిక వర్షాలు రాష్ట్రానికి సమస్యలుగా ముందున్నాయి. వివిధ తరగతుల ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు, గ్రామీణ పేదలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో రాజధాని తరలింపు యోచన విడనాడి ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం పూనుకోవడం శ్రేయస్కరం. కాని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు.

(వ్యాసకర్త సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)   సిహెచ్. బాబూరావు                   రాజధానిపై పాలకుల విఫల విధానాలు