Feb 24,2023 15:08

చంఢీఘర్  :   పంజాబ్‌ పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు సంయమనం పాటించామని సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ హర్పాల్‌ సింగ్‌ రాంధవా శుక్రవారం తెలిపారు. అమృతపాల్‌ సింగ్‌ తనతోపాటు సిక్కుల మత గ్రంధమైన గురుగ్రంధ్‌ సాహిబ్‌ను కూడా తీసుకువచ్చారని... గురు గ్రంథ్‌ సాహిబ్‌ను గౌరవించి వెనక్కి తగ్గామని.. అందుకే వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు.

మొదట శాంతియుతంగా ధర్నా చేస్తామని అమృతపాల్‌ సింగ్‌ చెప్పారని, కానీ ఆయన మమ్మల్ని మోసం చేశారని అన్నారు. అతని వ్యక్తులు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారని మండిపడ్డారు. పంజాబ్‌లో చట్టబద్ధమైన పాలన ఉందని, అమృత్‌పాల్‌ సింగ్‌ చట్టానికి అతీతం కాదని అన్నారు. ఖలిస్తానీ ఉద్యమానికి పిలుపునిచ్చిన అమృతపాల్‌ సింగ్‌కు పోలీసుల ప్రతిస్పందన ధైర్యాన్నిచ్చిందని, ఆప్‌ పాలిత పంజాబ్‌లో శాంతిభద్రతలు బలహీన పడ్డాయనడానికి ఇది నిదర్శనమన్న విమర్శలను హర్పాల్‌ సింగ్‌ కొట్టిపారేశారు. లవ్‌ ప్రీత్‌ తుఫాన్‌ సింగ్‌ను విడుదల చేయాలంటూ అమృతపాల్‌సింగ్‌కు చెందిన వందలాది మంది అనుచరులు కత్తులు, తుపాకులతో పంజాబ్‌లోని అమృతసర్‌ పోలీస్‌స్టేషన్‌పై గురువారం దాడికి దిగిన సంగతి తెలిసిందే.