Jun 20,2022 17:17

ప్రజాశక్తి-నందిగామ : భారతదేశంలో కొందరు చేసినటువంటి వ్యాఖ్యల‌ వలన ప్రపంచ దేశాలలో కూడా నిరసన వ్యక్తమవుతుందని నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త పై అవివేకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ముస్లిం జే.ఏ.సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన సభలో ఎమ్మెల్యే  మొండితోక జగన్ మోహన్ రావు, మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఇటువంటి విద్వేష వ్యాఖ్యలను - అవమానపరిచే విధంగా చేసే వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్ధించకూడదు ప్రోత్సహించకూడదన్నారు. మహమ్మద్ ప్రవక్త పై నూపూర్ శర్మ - నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలను దేశంలోని హిందువులు కూడా ఖండించారన్నారు. నందిగామలో భిన్నత్వంలో ఏకత్వం -ప్రజాస్వామ్యం - లౌకికవాదం ఎప్పుడు ప్రదర్శించబడతాయి, అందుకు ఉదాహరణే ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు అన్ని పార్టీల వారు ,ప్రజా సంఘాల వారు, లౌకికవాదులు, రాజ్యాంగ ప్రేమికులు, దళిత సంఘాల నాయకులు తరలివచ్చి భారత సమాజంలో అటువంటి వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదు అని వారి అభిప్రాయాలు తెలపడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జెఎసి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.