గోరంట్ల టౌన్ : ఫీజుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్న గోరంట్ల మండలం కమ్మలవాండ్లపల్లి వద్ద ఉన్న బెస్టు యూనివర్సిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు ఫీజులు కట్టలేదన్న సాకుతో సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. పరీక్ష రాయాలంటే పరీక్ష ఫీజు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ.వెయ్యి కట్టాలనే నిబంధన పెట్టారన్నారు. 9 సబ్జెక్టులకు అదనంగా రూ.9వేలు కట్టి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలోనే ఫీజు ఒత్తిడి తాళలేక శుక్రవారం నాడు యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడని చెప్పారు. అధ్యాపకులు, యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యకం చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. హాస్టల్లో భోజన వసతి, మౌలిక వసతులు కూడా సరిగా లేవన్నారు. అధిక ఫీజులు ఎందుకోసం వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన విద్యార్థులను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. పరీక్షలు ప్రతి సమయంలోనూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ చిత్రాయిసెల్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా, నిరంకుశగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికొచ్చి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సమస్యను పోలీసులకు తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం విద్యార్థుల వద్దకొచ్చి సమస్యలను విన్నారు. యాజమాన్యంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఫీజుల కోసం వేధిస్తే ఉద్యమిస్తాం
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి
హిందూపురం : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఫీజుల కోసం వేధింపులకు పాల్పడుతున్న గోరంట్ల మండలంలో ఉన్న బెస్టు యూనివర్సిటీ సిబ్బంది తీరులో మార్పు రాకుంటే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులో మాట్లాడుతూ గోరంట్లలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీలో అధిక ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని చెప్పారు. ఈ ఫీజులు వేధింపులు తాళలేక నాలుగవ సంవత్సరం చదువుతున్న మనోహర్ అనే విద్యార్థి శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనివర్సిటీ నిర్వాహణ లేదన్నారు. గతంలో కూడా ఇదేవిధంగా విద్యార్థులను యూనివర్సిటీ ఫీజులు పేరిట వేధించారని తెలిపారు. అప్పట్లో దీనిపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేశామన్నారు. యూనివర్సిటీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యం ఫీజులు పెంచి వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు కడితేనే పరీక్షలకు అనుమతిస్తామంటూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.










