Aug 18,2022 22:53

ప్రజాశక్తి-కలక్టరేట్‌
ఉపాధ్యాయుల హాజరు కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత యాప్‌ లను ఎవరు డౌన్లోడ్‌ చేసుకోవద్దని ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. గురువారం స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్యాప్టో నాయకులు మాట్లాడుతు.విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాల్సిన సమయంలో యాప్‌ పని భారం మోపడం ఎంత వరకూ సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికే అనేక రకాల యాప్‌ లతో విద్యార్థులు కు బోధన ప్రక్రియ సమయంలో తీవ్ర అసౌకర్యం నెలకొందని కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి యాప్‌ల బారం తగ్గించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేవిధంగా విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. హాజరు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ఫోన్ల ద్వారా కాకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా డివైజ్‌ చేసి నెట్‌ వర్క్‌, సర్వర్‌ ప్రాబ్లం లేకుండా చూడాలన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్షగట్టిన వ్యవహరిస్తుందని అవేదన వ్యక్తం చేశారు. అసలే ఓ పక్క పాఠశాలల విలీనంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి సమయంలో విద్యార్థుల బోధనకు అడ్డంకిగా మారిన యాప్‌లను వినియోగించాలి అనడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. అలాగే జిల్లా విద్యాశాఖ లో సీనియారిటీ జాబితా సక్రమంగా ప్రకటించక పోవడం వల్ల సీనియర్లు నష్టపోతున్నారని కాబట్టి ప్రతి నెల సీనియార్టీ జాబితాను ప్రకటించి పదోన్నతుల ప్రక్రియ ప్రతినెలా పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలన్నారు. అదేవిధంగా రెండేళ్ళ నుండి గురుపూజోత్సవ సందర్భంగా ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయులను ఈ ప్రక్రియను నిలిపివేశారని కాబట్టి ఈ ఎంపిక ప్రక్రియ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లెనిన్‌ బాబు, జె. ప్రసాద్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు ,ఎస్‌ టి యు రాష్ట్ర నాయకులు కొమ్ము ప్రసాద్‌ ,ఎపి టి ఎఫ్‌ నాయకులు బి.లంకేష్‌ , తమ్ము నాగరాజు ,బి టి ఏ నాయకులు కొమ్ము నూకలయ్య ,కష్ణ మూర్తి సూరిబాబు, ఆఫ్టా నాయకులు వి. సత్యనారాయణ , ఎ ఆర్‌ అస్లాం ,లు పాల్గొన్నారు.