ప్రజాశక్తి-పెనుకొండ పారిశుధ్య కార్మికులకు ఫేస్‌యాప్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకరనారాయణను సిఐటియు నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల జీతాలు, ఉద్యోగాలకు ముప్పు తెచిపేట్టేలా ఉన్న ఫేస్‌యాప్ విధానాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అలాగే పర్మినెంట్ సిబ్బందితోపాటు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల రోజువారి పనికి సంబంధించిన హాజరు విధానంలో రాష్ట్రప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు చాలా ఇబ్బందిగా ఉన్నాయన్నారు. ఇందుకోసం తీసుకొచ్చిన జీవో 159ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కొత్త హాజరు విధానం ద్వారా ఎవరి సెల్‌ఫోన్‌లో వారే స్వయంగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో నిలబడి ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలన్నారు. కార్మికుల్లో అత్యధిక మందికి చదువే రాదన్నారు. అలాంటప్పుడు ఫొటోలు ఎలా అప్‌లోడ్ చేస్తారని ప్రశ్నించారు. కాగా కార్మికులందరికీ పనిముట్లు, రక్షణ పరికరాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని, సాధారణ మృతిచెందిన కార్మికుల కుటుంబానికి రూ.2లక్షలు, ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పర్మినెంట్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, సిఐటియు జిల్లా నాయకులు పైపల్లి గంగాధర్, వజ్రం నాగప్ప, పారిశుధ్య కార్మికుల యూనియన్ నాయకులు చిన్న వెంకటేష్, రిక్షా నర్సింహులు, తిప్పన్న, నరసింహులు, గజేంద్ర, శాంతమ్మ, గంగరత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శంకరనారాయణకు వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు










