ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగంలోనికాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేస్‌యాప్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. ఈ యాప్‌ను రద్దు చేసే వరకు కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. శనివారం పట్టణంలోని కల్లూరు సుబ్బారావు ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆందోళనకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. వీరందరికీ స్మార్ట్ ఫోన్లు లేవన్నారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాన్ని అనుసరించి కార్మికుల హాజరు విధానం ఎండి ఎఫ్‌ఆర్‌ఎస్ స్థానంలో ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ను గత నెల 16వ తేదీ నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త హాజరు విధానం ద్వారా ఎవరి సెల్ ఫోను లో వారే స్వయంగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో నిలబడి ఫోటో తీసి ప్రభుత్వం తయారు చేసిన యాప్ ద్వారా హాజరు పంపించాలని నిబంధనలు పెట్టడం అన్యాయమన్నారు. మున్సిపల్ కార్మికుల్లో అత్యధిక మంది నిరక్ష్యరాస్యులు ఉన్నారన్నారు. అందులోను అత్యధిక మందికి సొంత స్మార్ట్ ఫోన్లు లేవన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని వీరి సమస్యలు వర్ణాతీతంగా మారాయని అన్నారు. సెల్ ఫోన్ లో నెట్ లేక పోవడం, నెట్ వర్క్ ఉంటే సర్వర్ లేకపోవడం లాంటి సమస్యల వల్ల కార్మికులు గంటల తరబడి మున్సిపల్ కార్యాలయం ముందు సెల్ ఫోన్లు చేతుల్లో పట్టుకొని పేస్ యాప్‌నమోదు చేయడానికి నానా తంటాలు పడుతున్నారని అన్నారు. దీంతో కార్మికులు హాజరు అయినప్పటికీ, ముఖ ఆధారిత హాజరులో హాజరు కాలేదని పడుతోందన్నారు. హాజరుకాని రోజుల వేతనాలను ఇవ్వకుండా రద్దు చేయడంతో పాటు కార్మికులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కార్మికులను విధుల్లో నుంచి తొలగించే అవకాశాలు సైతం ఎక్కువగా ఉన్నాయన్నారు. కార్మికులకు శాపంగా ఉన్న ఈ యాప్ ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఈనెల 16వ తేదీన హిందూపురం పురపాలక సంఘ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్నామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి జగదీష్, మున్సిపల్ వర్కర్స్ అధ్యక్షులు మల్లికార్జున, కోశాధికారి ఆనంద, నాయకులు మంజు, నాగేంద్ర, చంద్ర, నరసింహమూర్తి, రామాంజనేయులు, ఓబులమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.










