ప్రజాశక్తి-విజయవాడ : పుస్తక పఠనం, సృజనాత్మక కళల ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని, మేదోశక్తిని పెంపొందించుకోగలుగుతారని ఇందుకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఎంతో దోహాదపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జిల్లా పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఠాగూర్ మెమోరియల్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జ్వోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం సృజనాత్మక కళలు విద్యార్థులలో మేదోశక్తిని పెంచేందుకు దోహదపడతా యన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి ఇంటర్‌నెట్ యాప్‌ల ద్వారా సెల్‌ఫోన్‌లలో విజ్ఞానం అందుబాటులో లభ్యం అవుతున్నప్పటికి పుస్తక పఠనం అందించే విజ్ఞానం ఎంతో నైపుణ్యాన్ని ఇస్తుందన్నారు. ప్రజలకు అవసరమైన విజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికి గ్రంధాలయాల నిర్వహణకు అవసరమైన నిధులను మంజూరు చేస్తుందన్నారు. గ్రంధాలయాలునేటికి సజీవంగా నిలిపేందుకు పఠనా శక్తిగల పాఠకులు ఉండటమే కారణమన్నారు. పుస్తకాన్ని చదివి విజ్ఞానం పొందడంలో కలిగే అనందం చెప్పనలవి కాదన్నారు. సుదీర్ఘ వేసవి విరామ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. పుస్తక పఠనం, పుస్తక సమీక్షలు, న్యత్యం, చిత్రలేఖనం, సంగీతం, కథలు చెప్పడం వినడం వంటి అంశాలలో విద్యార్థులను ప్రోత్సహించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి విజ్ఞానాన్ని అందించేందుకు జూన్ 11వ తేది వరకు నిర్వహించే వేసవి శిక్షణ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ టి.జమల పుర్ణమ్మ, కార్యదర్శి వి. రవికుమార్, లైబ్రేరియన్ కె.రమాదేవి, లయోలా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ గుమ్మా సాంబశివరావు, ఆల్ ఇండియా రెడియో రిటైర్డ్ అధికారి వింజమూరి కృష్ణకుమారి, సంగీత ఉపాధ్యాయురాలు యం దివ్యమాధవి, పద్య శ్లోకాల గాయకురాలు టి సునీత, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.










