Sep 19,2023 18:59

ఏర్పాట్లు పరిశీలిస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి-నెల్లూరు :వినాయక చవితి పండుగ సందర్భంగా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఇరుకళల పరమేశ్వరి ఆలయం సమీపంలోని నిమజ్జనం ఘాట్‌ వద్ద ఏర్పాటు పనులను కమిషనర్‌ మంగళవారం పర్యవేక్షించారు.కమిషనర్‌ మాట్లాడుతూ నిమజ్జనం కార్యక్రమం కోసం ఘాట్‌ వద్ద భారీ క్రేన్‌ లు, మర బోట్లు, బారికేడ్ల ఏర్పాటు, రాత్రి పూట లైటింగ్‌, సి.సి కెమెరాల నిఘా పర్యవేక్షణ, ట్రాఫిక్‌ కంట్రోల్‌ నిమిత్తం మైక్‌ అనౌన్స్మెంట్‌ తదితర వసతులు కల్పించామని తెలిపారు. పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్‌ లను కేటాయించి ట్రాక్టర్లు, చెత్త సేకరణ ఆటోలతో ఘాట్‌ ప్రాంగణం నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించనున్నామని కమిషనర్‌ వివరించారు. నిమజ్జనం జరిగే చెరువు ప్రాంతంలో ఆకులు, పూలు, ఇతర వ్యర్ధాలు వేయకుండా భక్తులకు సూచనలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇంజనీరింగ్‌, శానిటేషన్‌ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు