రానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం నిరాశ కలిగించింది. సమావేశాల నడుమ ఆరు మాసాల గడువు దాటరాదన్న నిబంధనను అనుసరించి ఈ సమావేశాలు ఆఖరు ఘడియల్లో జరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో వివిధ పరిమితుల మధ్య జరుగుతున్న ఈ సమావేశాల్లో జరగాల్సిన చర్చలెన్నో ఉన్నాయి. ప్రభుత్వం స్పష్టపర్చవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నోత్తరాలు సజావుగా సాగితే ప్రజలకు మెరుగైన ఫలితాలు, సమాధానాలు లభ్యమయ్యేవి. అసలు పార్లమెంట్ భాద్యతే అది. ప్రజల తరపున ఎన్నికైన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని నిలదియ్యడం. జవాబుదారీ చెయ్యడం. విధానాల్లో మంచీ చెడు చర్చించి మెరుగైన విధానాలు అమల్లోకి వచ్చేలా చూడడం. అలాగే ప్రభుత్వం కూడా తన విధానాలు ఎందుకు సరైనవో తెలిపే ప్రయత్నం చెయ్యడంతోబాటు ప్రజల్ని విశ్వాసం లోకి తీసుకునే బాధ్యత పడడం. ప్రస్తుతం ఆర్థిక మందగమనం, నిరుద్యోగిత, విరుచుకు పడుతున్న మహమ్మారి, ఆరోగ్య అత్యయికస్థితి తో బాటు, సరిహద్దుల్లో పొరుగు దేశాలతో సమస్యలతో దేశం ఇబ్బందుల్లో ఉంది. అసలు ప్రశ్నోత్తరాలు ఉండాల్సిందే ఇప్పుడు. అందుకు విరుద్ధంగా అదేదో సమయ హరణంలా భావించి రద్దు చేయడం అసమంజసం. ప్రజలే ప్రభువులన్న స్ఫూర్తికి విరుద్ధం. ఉభయ సభలూ, సభాధిపతులు ఈ విషయమై పునరాలోచించాలి. అందుకు అధికార పక్షం మద్దతు తెలపాలి. ఒకవేళ అలాంటి మార్పులేవీ చెయ్యనప్పుడు ప్రతిపక్షాలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చెయ్యాలి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై, పరిష్కారాలపై లోతుగా చర్చలు జరిగేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. సంక్షోభ సమయంలో దేశం మొత్తం పార్లమెంట్ వైపు ఆశగా చూస్తుందని గుర్తుంచుకోవాలి.
- డా|| డి.వి.జి.శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.










