Jan 07,2021 21:23

న్యూఢిల్లీ : స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) అమాంతం పడిపోనుందని కేంద్ర ప్రభుత్వం తొలిసారి తన అంచనాలు ప్రకటించింది. గత రెండు, మూడేళ్లుగా అసలే స్తబ్దతలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ నిబంధనలు తోడు కావడంతో వ్యాపార కార్యకలాపాలు, కుటుంబాల ఆదాయం దెబ్బతినడంతో జిడిపి రికార్డ్‌ స్థాయిలో 1952 నాటి కనిష్ట స్థాయికి పడిపోనుందని అంచనా. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి మైనస్‌ 7.7 శాతానికి క్షీణించే అవకాశాలున్నాయని గురువారం కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ తొలిసారి తన ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ), బ్లూమ్‌బర్గ్‌ నిపుణుల సర్వే తదితర అంచనాలు 7.5 శాతం పతనంతో పోల్చితే మంత్రిత్వ శాఖ గణంకాలు మరింత ఆందోళనకరంగా ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే కరోనా వైరస్‌ కేసుల నమోదులో ప్రస్తుతం భారత్‌ 1.04 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
కరోనా సంక్షోభానికి తోడు మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో కోట్లాది మంది ఉపాధి దెబ్బతిన్నది. అనేక మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉన్న ఉద్యోగుల వేతనాల్లోనూ కోతలు విధించబడ్డాయి. ఈ పరిణామాలతో ప్రజల కొనుగోలు శక్తి మరింత కుంచించుకు పోయింది. ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జిడిపి ఏకంగా మైనస్‌ 23.9 శాతం క్షీణించింది. జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) మైనస్‌ 7.5 శాతం పతనమయ్యింది. జూన్‌ త్రైమాసికంలో తయారీ రంగం మైనస్‌ 39 శాతం పతనాన్ని చవి చూసింది. వాణిజ్యం, హోటళ్లు ఏకంగా మైనస్‌ 15 శాతం పతనాన్ని చవి చూశాయి. రక్షణ, ఇతర రంగాలు 12 శాతం ప్రతికూల వృద్థిని ఎదుర్కొన్నాయి. విత్త, రియల్‌ ఎస్టేట్‌, నైపుణ్య సర్వీసుల రంగాలు మైనస్‌ 8.1 శాతం పడిపోయాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచంలోనే 24 ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత జిడిపి అత్యంత పేలవంగా నమోదయ్యింది. అమెరికా ఏకంగా 33.1 శాతం వృద్ధిని సాధించింది. జపాన్‌ 5.8 శాతం, ఇటలీ 4.7 శాతం, ఫ్రాన్స్‌ 4.3 శాతం, జర్మనీ 4 శాతం చొప్పున పతనాన్ని చవి చూశాయి. వీటితో పోల్చితే భారత్‌ అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చడంతో పాటుగా దేశంలో తీవ్ర సంక్షోభం కొనసాగుతుందని స్పష్టమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.