న్యూఢిల్లీ : భారత రియల్ ఎస్టేట్ రంగం ఇది వరకు ఎప్పుడూ లేని దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటుంది. సరైన ప్రణాళికలు లేకుండా కరోనా కట్టడికి ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనలు ఈ రంగాన్ని కుదేలు చేశాయి. దీంతో నివాస, కార్యాలయా స్థలాల డిమాండ్‌లో స్తబ్దత నెలకొనడంతో ఈ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు దెబ్బకు దాదాపుగా రెండేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్న రియాల్టీ.. అనంతరం కొంత పుంజుకుంటుందనే సమయంలోనే జిఎస్‌టి, రెరా సంస్కరణలకు తోడు కరోనా సంక్షోభం ఈ రంగాన్ని ముప్పు తిప్పలకు గురి చేస్తుంది. ఆస్తుల స్థిర ధరలు, చౌక గృహ రుణ వడ్డీ రేట్లు, డిస్కౌంట్లు తదితర అంశాలు ఈ పరిశ్రమకు పెద్దగా రికవరీని ఇవ్వలేకపోయాయి. కాగా ఈ ఏడాది 40-50 శాతం మేర గృహ అమ్మకాలు, ఆఫీసు లీజింగ్ పడిపోయిందని పలు రిపోర్ట్‌లు ఇప్పటికే అంచనా వేశాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో ఈ రంగం అమ్మకాలు నిలిచిపోయాయి. వచ్చే కొత్త ఏడాదిపైనే ఈ రంగం ఆశలు పెట్టుకుంది.
గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని క్రెడారు ఛైర్మన్ జక్సారు షా పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు, జిఎస్‌టి, రెరా లాంటి సంస్కరణలు ఈ రంగాన్ని కుదేలు చేశాయన్నారు. వీటికి తోడు కరోనా సంక్షోభం తోడు కావడం ఈ రంగాన్ని కుప్పకూలేలా చేసిందన్నారు. పరిస్థితి చాలా కఠినంగా ఉందని క్రెడారు ప్రెసిడెంట్ సతీష్ మగర్ అన్నారు. లాక్‌డౌన్ తర్వాత అమ్మకాలు కొంత మెరుగుపడినప్పటికీ.. అనేక నగరాల్లో ఇప్పుడిప్పుడే కోవిడ్‌డ్‌కు ముందు స్థాయికి చేరుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం అనేక సవాళ్లు నెలకొని ఉన్నప్పటికీ భారత రియాల్టీ రంగానికి మంచి రోజులు రావడానికి ఇంకెంతో కాలం పట్టకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా దెబ్బకు రియాల్టీకి డిమాండ్ పడిపోవడంతో ఏడాదికేడాదితో పోల్చితే 2020లో గృహ అమ్మకాలు 47 శాతం తగ్గి 1.38 లక్షల యూనిట్లకు తగ్గాయని ఇటీవల అన్‌రాక్ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. 2019లో ఢిల్లీాఎన్‌సిఆర్, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పూణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నరు, కోల్‌కత్తా నగరాల్లో 2.61 లక్షల గృహాలు అమ్మకాలు అయ్యాయి. ఇదే ఏడాది నూతన గృహాల విక్రయాలు 2.37 లక్షల కోట్లుగా చోటు చేసుకోగా.. 2020లో ఈ సంఖ్య 1.28 లక్షల కోట్లకు పరిమితం కానుందని అన్‌రాక్ అంచనా వేసింది. 2014 తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి అని తెలిపింది.










