పెనుమల్లి మధు
రాష్ట్రంలో కరోనా కేసులు భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. మరణాల సంఖ్య పెరిగింది. గ్రామాలకు కరోనా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ల లోనూ, కోవిడ్ ఆసుపత్రుల లోనూ డాక్టర్లు, సిబ్బంది కొరతతో సరైన వైద్యం లేదు. డాక్టర్లు, సిబ్బంది రిక్రూట్‌మెంటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా ఇంటర్వ్యూలకు డాక్టర్లు రాలేదు. కరోనా వైద్య శాలలు సిబ్బంది లేమితో వెలవెలబోతున్నాయి. కోవిడ్ ఆసుపత్రులలో బెడ్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రయివేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ అంగీకరించక, ప్రయివేటు ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక బాధితులు అవస్తల పాలవుతున్నారు. ఆసుపత్రులకు వచ్చే మార్గం మధ్యలోనే ప్రాణాలు పోతున్న సందర్భాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షం ప్రజల గోడు పట్టని రాజకీయాలు నెత్తికెత్తుకున్నాయి. కేంద్రంలో బిజెపి కరోనా బాధితుల్ని ఆదుకోవడం మాని రాముడి బాటలో అభివృద్ధి అని వేదాలు వల్లిస్తోంది. నిత్యావసర సరుకుల చట్టానికి సవరణల ఆర్డినెన్సు, నూతన విద్యావిధానం లాంటి వాటితో రాష్ట్రాల హక్కులను హరించడానికి పూనుకుంటోంది. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బాధల్లో ఉన్న ప్రజలను వదిలి మూడు రాజధానుల వివాదాన్ని లేపింది. దొరికిందే సందు అని ప్రతిపక్ష తెలుగుదేశం అమరావతే రాజధాని అంటూ ప్రభుత్వ రాజీనామా డిమాండ్ చేస్తోంది. కరోనాను, వలస కూలీలను వదిలి ప్రజల గోడు పట్టని రాజకీయాలను వీరు నెత్తికెత్తుకున్నారు.
రాజధాని నిర్మాణం
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వికేంద్రీకరణ ప్రాతిపదికగా అభివృద్ధి జరగాలని సిపిఐ(యం) మొదట్లోనే ప్రకటించింది. ఆనాడు అధికారానికి వచ్చిన తెలుగుదేశం ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించినా అందరికీ అందుబాటులో ఉంటుందన్న దాన్ని పరిగణలోకి తీసుకొని అమరావతి రాజధానిని సిపిఐ(యం) బలపర్చింది. అదే సమయంలో ల్యాండ్ పూలింగ్ పేర జరిగిన బలవంతపు భూసేకరణను ఆనాడే వ్యతిరేకించింది. అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ కేంద్రీకరించాలనే టిడిపి వైఖరి రాష్ట్రానికి నష్టదాయకమని హెచ్చరించింది. ఆరు సంవత్సరాల అనంతరం ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల వివాదం రేపడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని భావిస్తున్నది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి నీటి వనరులు, పరిశ్రమలు చేపట్టాలి. కడప ఉక్కు, అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీ, డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే జోను, రాష్ట్ర రాజధాని నిర్మాణం లాంటి సమస్యలు వదిలిపెట్టి రాజధానినే వికేంద్రీకరణగా చిత్రించడాన్ని, అభివృద్ధికి ప్రాతిపదికగా ప్రతిపాదించడాన్ని సిపిఐ(యం) తప్పుబడుతోంది. వైఎస్సార్ పార్టీ గాల్లో మేడలు కట్టదల్చుకుంటే భంగపడడం తథ్యం.
ఉపాధి - ధరలు
రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,171 కొత్త కేసులు వచ్చాయి. 89 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,06,960 పెరిగింది. లాక్‌డౌన్ ఉపాధిని దెబ్బకొట్టింది. లాక్‌డౌన్ మూలంగానూ, కరోనా విస్తరణ వల్ల, పరిశ్రమలు, వ్యవసాయం సాగక ఉపాధి దెబ్బతిన్నది. 94 శాతం కూలీలకు పట్టణాల్లో ఉపాధి హారతి కర్పూరంలా కరిగిపోయింది. చిన్న చిన్న వ్యాపారాలూ సాగక ఆదాయాలు పోయాయి. స్వయం ఉపాధి అడుగంటిపోయింది. ప్రతిరోజూ కొందరు పట్టణాల్లో బతకలేక గ్రామాలకు సంసారాలను తరలించడం పట్టణాల్లో తరుగుతున్న ఉపాధిని సూచిస్తోంది. మరోవైపు పెరిగిన ధరలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పెట్రోలు, డీజిల్‌తో ధరలు పెరిగి కూరగాయలు సైతం కొనలేని స్థాయికి చేరాయి. సామాజికంగా వెనకబడ్డ దళితులు, గిరిజనులు కరోనా కష్టాల్లో కూరుకు పోతున్నారు. విద్యా వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంది. లక్షలాది మంది విద్యార్థులు ఎదరు చూస్తున్నారు. అసలు స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభం అవుతాయా? అని తల్లిదండ్రుల ఆందోళన. ఈ తరుణంలో ప్రజా వైద్యాన్ని బలోపేతం లాంటి చర్యలపై కేంద్రీకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూనుకోవడం లేదు.
దారితప్పిన ప్రాధాన్యతలు
ఉపాధి దెబ్బతిన్న ప్రజలకు ఊతమివ్వాల్సిన తరుణంలో దానిని వెనక్కు నెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని తరలింపు - మూడు రాజధానుల వివాదాన్ని తలకెత్తుకున్నది. పరిపాలనా రాజధాని అని సిఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ పర్యటన, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషా రాణి వివరాల సేకరణ పేరుతో పర్యటన, పోలీసు అధినేత గౌతమ్ సవాంగ్ తమ హెడ్‌క్వార్టర్స్ భవనాల కోసం విశాఖ పర్యటన, ఇలా మారిపోయాయి అధికారుల పని ప్రాధాన్యతలు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ రాజధాని శంఖుస్థాపన పనిలో కరోనా రోగుల బాధలు పట్టలేదు. ఆగష్టులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగుతుందని అధికారులు అందరూ దానిచుట్టూ తిరుగుతున్నారు. అలాగే రాష్ట్ర హెచ్‌వోడిల ఆఫీసుల వసతుల కోసం వెతుకులాట జరుగుతున్న వార్తలు వెలువడుతున్నాయి. 151 మంది ప్రతినిధులతో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ప్రజా పాలనకు గాక తెలుగుదేశాన్ని దెబ్బగొట్టే రాజకీయాలపైకి దృష్టి సారించింది. ఈ కారణంగానే వివాదాస్పద అంశాలు తలకెత్తుకున్నది. మూడు రాజధానులు, రాష్ట్ర ఎన్నికల కమీషన్, కార్యాలయాలకు రంగులు, మాతృభాషలో విద్యా భోధన బదులు ఇంగ్లీషు మీడియం లాంటివి ప్రాధాన్యతాంశాలుగా ముందుకు తెచ్చింది. వివాదాలే ప్రధానాంశాలుగా ముందుకొచ్చాక పాలన అడుగంటి ఇసక ధరలు, అవినీతి, పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్ భారాలు లాంటివి ముందుకొచ్చాయి. ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయి.
ప్రజా సమస్యలు పట్టని టిడిపి
అధికార పార్టీ మాదిరిగానే ప్రతిపక్ష టిడిపి సైతం వైఎస్సార్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడమే ఏకసూత్ర కార్యక్రమంగా భుజానకెత్తుకొంది. కరోనాలో దెబ్బతిన్న బాధితులుకానీ, వలస కూలీల వెతలు కానీ దీనికి పట్టలేదు. రాజధాని సమస్య ఒక్కటే తక్షణ ప్రధాన సమస్య అయినట్టు వ్యవహరిస్తోంది. వైఎస్సార్‌సిపి మీద వ్యతిరేకతతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బిజెపి ని అన్నింటా సమర్ధించేందుకు సిద్ధపడింది. గత ఎన్నికలలో బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఆ సంగతే మరిచిపోయి ఇప్పుడు బిజెపికి చేరువ కావాలని ప్రయత్నిస్తున్నారు.
బిజెపి ప్రమాదాన్ని విస్మరిస్తున్న ఆ రెండు పార్టీలు
రాష్ట్రానికి, ఫెడరలిజానికి, లౌకిక విధానానికి బిజెపి చేటు తెచ్చే విధానాలను ముందుకు తెస్తున్నా వైఎస్సార్‌సిపి గాని, టిడిపి గాని బిజెపిని పల్లెత్తుమాట అనకపోగా పలు సందర్భాలలో వంత పాడుతున్నాయి. మైనారిటీ హక్కులను హరించే ఎన్‌ఆర్‌సి పట్టలేదు. 370 అధికరణం రద్దు చేస్తే అన్యాయమని అనలేదు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచితే ఇది కూడదు అని ప్రకటించలేదు. ఆర్డినెన్సు మీద ఆర్డినెన్సు తెచ్చి నిత్యావసర వస్తువుల చట్టాన్ని, రైతాంగ ఉత్పత్తుల ధరలకు రక్షణ చర్యల్ని కేంద్రం నిర్వీర్యం చేసినా బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట మాట్లాడలేదు. రైతుల ఉచిత విద్యుత్‌కి, ప్రజల సామాజిక న్యాయానికి ప్రమాదాన్ని తెచ్చే విద్యుత్ చట్టం వచ్చినా పల్లెత్తు మాట మాట్లాడలేదు.
బిజెపి వైఖరి - రాష్ట్ర భవిష్యత్
కేంద్ర బిజెపి ప్రభుత్వం గత ఆరేళ్ళుగా మన రాష్టానికి అన్యాయం చేస్తూనే వుంది. ప్రత్యేక హోదా నిరాకరణ, విభజన చట్టం లోని హామీల అమలు విషయంలో మొండి చేయి, వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక నిధుల ఎగనామం- ఇలా ఈ అన్యాయాలకు అంతు లేదు. తాజాగా అమరావతి విషయం లోనూ బిజెపి ది ద్వంద్వనీతే. ఆరేళ్ళ క్రితం చెంబెడు నీళ్ళు, గుప్పెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకొంది. ఇప్పుడేమో అమరావతిని తరలించరాదని రాష్ట్ర బిజెపి ప్రకటిస్తే కేంద్ర బిజెపి మౌనం పాటిస్తోంది. తమకేమీ సంబంధం లేదంటోంది. దీనివెనక ఈ రాష్ట్రంలో తాను ఎలాగైనా చక్రం తిప్పాలనే తాపత్రయం ఉంది. అందుకోసం కేంద్రంలో తనకున్న అధికారాన్ని దుర్వినియోగపరచడానికి వెనకాడడం లేదు. రాష్ట్రంలో ఒకపార్టీని కబళించి అధికార పార్టీని ఢకొీట్టాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాన్సాఫ్ ట్రస్టు వ్యవహారంలో విజయనగరం రాజుల పెత్తనానికి పోటీ పెట్టింది. బొబ్బిలి రాజులు వీరికి తోడవుతారన్న వార్తలు వచ్చాయి. బ్యాంకుల్ని ముంచి చిక్కుల్లో ఉన్న రాజ్యసభ ఎంపీలను లోబర్చుకున్న తీరును చూశాం. త్రిపుర రాజకీయాల్లో కుట్రలు పన్ని నీతిమాలిన రాజకీయాలు అల్లిన సునీల్ దియోధర్‌ని రాష్ట్రం మీదకు వదిలింది. ఒకవైపు మతోన్మాద ప్రచారం మరోవైపు సోషల్ ఇంజనీరింగ్ ఆయుధాలుగా పవన్ కళ్యాణ్‌ని కలుపుకొని ప్రజల గోడు పట్టని రాజకీయాల్ని బిజెపి రాజేస్తోంది. బిజెపి కుట్రల్ని ఎదిరించి ఆ పార్టీని తిరస్కరించడం రాష్ట్ర ప్రయోజనాలరీత్యా అత్యావశ్యకం.
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత
మొత్తంమీద రాష్ట్రంలో అధికార పార్టీ గాని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ గాని ప్రజల సమస్యలకు గల ప్రథమ ప్రాధాన్యతను పూర్తిగా విస్మరించాయి. అటు కేంద్రానికి కార్పొరేట్ల సేవ, విభజన రాజకీయాలు తప్ప ప్రజల బాధలు పట్టడమేలేదు. ప్రజల గోడు పట్టని వీరి రాజకీయాల్ని ప్రతిఘటించడమే ప్రజల తక్షణ కర్తవ్యం కావాలి. కరోనా నేపథ్యంలో సరైన ప్రజా వైద్యం, ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500 ఆరు నెలలపాటు ఇవ్వడం, ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం, పోయిన ఉపాధిని ప్రభుత్వమే కల్పించడం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం, కార్మిక చట్టాలకు రక్షణ చర్యలు చేపట్టడం లాంటి వాటి కోసం పోరాడడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రజల హక్కుల పరిరక్షణకూ ఇదే మార్గం.
(వ్యాసకర్త సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి)










