Feb 16,2023 22:14

భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ప్రజల కోసం జిల్లా కేంద్రంలో కార్మిక, కర్షక భవనాన్ని నిర్మిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పేర్కొన్నారు. స్థానిక శ్రీ సత్య సాయి జిల్లా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో బేసిరెడ్డి నాగమ్మ పేరుతో చేపడుతున్న కార్మిక కర్షక భవన నిర్మాణ పనులను సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ గురువారం పరిశీలించారు. ఆయనతోపాటు జిల్లా సెక్రటరీ ప్రవీణ్‌, రామకృష్ణ, పైపల్లి గంగాద్రి తదితరులు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నాగమ్మ గారి పోరాటాల స్ఫూర్తిగా ఆమె ఆశయాలు కొనసాగింపు కోసం జిల్లా కేంద్రంలో భవన నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం ఉద్యోగ ,కార్మిక , కర్షకులకే కాకుండా దీనివలన పేద ప్రజలకు ఉపాధి కలిగే విధంగా ఉంటుదంన్నారు. ఇందులో మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలు, ప్రజలకు ప్రాథమిక చికిత్స కోసం వైద్య కేంద్రం, కళాకారుల అభివృద్ధి కోసం ఈ భవన సముదాయం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ భవన నిర్మాణ పనులు ఇప్పుడే మొదలయ్యాయని ఇందుకోసం ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి తమ తోడ్పాటు ఇస్తున్నారని చెప్పారు. మరింతమంది మానవతావాదులు, పార్టీ అభిమానులు, కార్మికులు, రైతులు సహకరించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సహకరించాలని వారు కోరారు.