Dec 25,2020 07:09

'స్థానిక సంస్థల ఎన్నికలు...కరోనా వ్యాక్సిన్‌ ఇవి రెండూ ప్రజలకు సంబంధించినవే! వీటిపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఇసి) పరస్పరం చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుంద'న్న హైకోర్డు ధర్మాసనం వ్యాఖ్య అక్షర సత్యం. ప్రభుత్వం నేరుగా చర్చించడం సాధ్యం కాకపోతే, ముగ్గురు అధికారులతో బృందాన్ని ఎస్‌ఇసి వద్దకు పంపాలని, ఆ భేటీకి వేదికను ఎస్‌ఇసి ఏర్పాటు చేయాలన్న న్యాయమూర్తి ఆదేశాలను ఇరుపక్షాలూ చిత్తశుద్ధితో అమలు చేయాలి. స్థానిక సంస్థలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఎస్‌ఇసి నవంబర్‌ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యపై అవగాహనకు రావాలని, ఆ సారాంశాన్ని ఈ నెల 29న చెప్పాలని కేసును ఆ రోజుకు వాయిదా వేసింది. కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్రం షెడ్యూల్‌ ప్రకటిస్తే అందుకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు ధర్మాసనం ఆశించిన స్ఫూర్తిని ఇరుపక్షాలూ ప్రదర్శించి సామరస్య పరిష్కారాన్ని సాధిస్తారని అందరూ అభిలషిస్తున్నారు.
కోవిడ్‌ వైరస్‌ సంక్రమణం చెంది, ప్రమాదకరమైన రీతిలో బ్రిటన్‌లో విజృంభిస్తోందనీ, ఐరోపా ఖండాన్ని చుట్టుముడుతోందన్న తాజా వార్తలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, భారత్‌లో అలాంటి పరిస్థితి లేకపోయినా ముందు జాగ్రత్తగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి పూట కర్ఫ్యూ విధించిన విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలి. దేశంలో మరో మారు లాక్‌డౌన్‌లు అనుభవించాల్సిన పరిస్థితి రాకూడదనే అందరూ కోరుకుంటున్నారు కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ను తక్కువ అంచనా వేయరాదు. దేశ ప్రజలందరికీ దశలవారీగా వ్యాక్సిన్‌ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆ మేరకు వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ ప్రకటించితే అన్ని రాష్ట్రాలూ పక్కాగా అమలు చేయాల్సిందే. గడచిన మార్చి నెలలో పూర్తి కావలసిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా విపత్తు కారణంగా వాయిదా పడ్డాయి. ప్రజలకు వివిధ సేవలు అందించడంలో తొలి మెట్టు స్థానిక సంస్థలే! దీర్ఘ కాలంపాటు వాటికి ఎన్నికలు లేకుండా కొనసాగించడం ఉచితం కాదు. అయితే, ప్రజారోగ్యాన్ని కాపాడడం కూడా ముమ్మాటికీ ప్రభుత్వ బాధ్యతే! కాబట్టి అన్ని పరిస్థితులను సాకల్యంగా అంచనా వేసి ఆచరణాత్మకమైన కార్యాచరణ రూపొందించడం అవసరం.


హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నట్టు 'స్థానిక' ఎన్నికలు, కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ రెండూ ప్రజల ప్రయోజనాలే. ప్రభుత్వం, ఎస్‌ఇసి ఇదే దృష్టితో ఆలోచించి, చర్చల్లో ఏకాభిప్రాయానికి రావాలి. అలాంటిది సాకారం కావాలంటే ఇప్పటి వరకు రెండు విరుద్ధ పక్షాల్లా వ్యవహరించిన వైఖరుల్ని ఇరువైపుల వారూ వీడాలి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరస్పరం సహకరించుకొనే వ్యవస్థలు. వార్డుల విభజన, రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చడం, శాంతి భద్రతలు కాపాడడం వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నెరవేర్చవలసిన అంశాలు. ఎన్నికల షెడ్యూల్‌ నిర్ణయించడం, ఆ రోజు నుండి వాటిని నిరపేక్షంగా నిర్వహించడం కమిషన్‌ బాధ్యత. ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వడంతోనే కమిషన్‌ పాత్ర ముగిసిపోతుంది. రాజ్యాంగం, రాష్ట్ర చట్టాలు విధి విధానాలను, సెపరేషన్‌ ఆఫ్‌ పవర్స్‌ను స్పష్టంగా విహితపర్చాయి. కనుక ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ పరస్పరం సమన్వయం చేసుకోవాల్సిందే. ఎన్నికల ప్రక్రియకు ముందు ప్రభుత్వంతో ఎస్‌ఇసి సంప్రదించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయం గమనార్హం. రెండు కొసలూ ఒక చోటికి చేరాకనే ముడి పడుతుంది. కాబట్టి ఇరు పక్షాలూ ప్రతిష్టకు పోకుండా సానుకూలంగా వ్యవహరిస్తేనే సామరస్యం వెల్లివిరుస్తుంది. అటువంటి నేపథ్యంలోనే ఏకాభిప్రాయ సాధన సాకారమవుతుంది. అందుకు పరస్పర విశ్వాసం ముఖ్యం. 'ప్రజల ప్రయోజనాలే ప్రధానం' అన్నది అందరికీ శిరోధార్యం.