Jul 18,2021 21:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వరంగ సంస్థలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతోందని జాతీయ బ్యాంకులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. జాతీయ బ్యాంకుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ అజరుకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లక్ష్మణరావు ముఖ్య అతిధిగా పాల్గని మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా మన దేశంలో బ్యాంకులు, బీమా రంగాలు బలంగా నిలబడటానికి కారణం అవి ప్రభుత్వ రంగంలో ఉండటమేనన్నారు. అటువంటి జాతీయ బ్యాంకులను ప్రయివేటీకరించేందుకు కంకణం కట్టుకున్న మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలంటే పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలన్నారు. 1969లో 14 బ్యాంకులను ఆ తరువాత కాలంలో మిగిలిన బ్యాంకులను అప్పటి ప్రభుత్వం జాతీయం చేసి ప్రజలకు చేరువ చేస్తే ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ బ్యాంకుల నుంచి కార్పొరేట్‌ సంస్థలకు పెద్ద మొత్తంలో అప్పులు ఇప్పించి తిరిగి వసూలు చేయకుండా చోద్యం చూస్తోందన్నారు. దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టపోవడానికి కార్పొరేట్లు, ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రజాహితం, దేశహితం కోరి గత ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న జాతీయ బ్యాంకులను పరిరక్షించుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజరుకుమార్‌ మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణకు నిరసనగా దేశవ్యాప్తంగా 5కోట్ల సంతకాలు సేకరణ జరిగిందన్నారు. గత ఏబై ఏళ్లుగా జాతీయ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించి రైతులకు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు, చేతి వృత్తిదారులకు, స్వయం ఉపాధి పొందే వారికి అండగా నిలుస్తున్నాయన్నారు. సిఐటియు కృష్ణా జిల్లా కార్యదర్శి ఎంవి సుధాకర్‌ మాట్లాడుతూ దేశంలో ఎటువంటి విపత్తులు వచ్చినా ప్రజలకు అండగా నిలబడి ఆదుకునేవి కేవలం ప్రభుత్వ రంగ సంస్థలేనని గుర్తుచేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌సి బోస్‌ మాట్లాడుతూ ఫ్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల్లో మేధావులు, విద్యార్థి సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎన్‌సిబిఇ నగర నాయకులు శేఖర్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్‌ బాలాజీ, ఆలిండియా బ్యాంకు పెన్షనర్ల అసోసియేషన్‌ నాయకులు శ్రీరామారావు, ఇపిఎఫ్‌ పెన్షనర్ల సంఘం నాయకులు టి ప్రభుదాస్‌, బెఫి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవిఎస్‌ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.