Jul 18,2021 22:01

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయభాషల్లో నిర్వహించాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. కేంద్ర పోటీ పరీక్షలను హిందీ, ఇంగ్లీషు మాధ్యమాల్లోనే నిర్వహిస్తున్నారని, దీని వల్ల ఆ బాషలు రాని విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. పోటీ పరీక్షలను ప్రాంతీయ బాషల్లోనే జరపాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పటికే లేఖ రాసి ఉన్నారని మంత్రి దృష్టికి ఆయన తీసుకువచ్చారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రాంతీయ భాషల సమస్యలపై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ఇప్పటికే ప్రకటించిన అన్ని నోటిపికేషన్లను నిలిపివేయాలని కోరారు. లేని పక్షంలో నిరుద్యోగ యవత తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.