పుట్టపర్తి అర్బన్ : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలని డిఆర్‌ఒ పి.కొండయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్లోని డిఆర్‌ఒ ఛాంబర్‌లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నేపథ్యంలో సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఎన్నికల నియమావళి అమలుకు ప్రతి ఒక్క అధికారి కషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. మార్చి 13వ తేదీన జరగనున్న ఎన్నికల కోసం జిల్లాలో 54 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించాలన్నారు. అన్ని పార్టీల నేతలూ ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.










