పింఛన్లు తొలగించడం అన్యాయం
ప్రజాశక్తి-అల్లూరు : జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో అర్హులకు పింఛన్లు తొలగించడం చాలా అన్యాయమని టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జెడ్‌పిటిసి బీద గిరిధర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం మండలంలోని నార్త్‌మోపూరు గ్రామంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో అనేక మందికి భూములు ఉన్నాయనే నెపంతో అధికారులు వృద్ధాప్య పింఛన్లు తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత పొలాలు ఎక్కడున్నాయో తెలపాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వయోవృద్ధులు అలసిపోయారని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ విచారం వ్యక్త పరిచారు. ఈ ప్రాంత ప్రజలు పనులు లేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇతర ప్రాంతాలైన సంఘం వైపు వెళ్లి పనులు చేసుకుని జీవిస్తున్నారన్నారు. మజారాల్లో తిరిగే క్రమంలో మేజర్ పంచాయతీగా ఉన్న నార్త్ మోపూరు గ్రామాన్ని అల్లూరు నగర పంచాయతీలో విలీనం చేయడంతో ఉపాధి హామీ పనులు లేక వలసలు వెళుతున్నట్లు బాధితులు వివరించారన్నారు. 2018లో అప్పటి చంద్రబాబు నాయుడు హయాంలో అల్లూరు-ఇస్కపల్లి రోడ్డును ప్రారంభించి తలపెట్టగా ఇంతవరకు పనులు పూర్తి చేయలేక పోవడంతో గుంతల మయంగా మారిందన్నారు. నార్త్ మోపూరు-పల్లెపాలెం గ్రామానికి సిమెంట్ రోడ్డు వేసినా ఇరువైపులా గ్రావెల్ తోలక పోవడంతో అనేకమంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇరువైపుల గ్రావెల్ తోలించమని కాంట్రాక్టర్‌ను అడిగితే గ్రావెల్ కిలోల లెక్కలో అమ్ముతున్నారని తెలియజేశారన్నారు. ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎలా బతకాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే జగన్ సర్కార్ చోద్యం చూస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కార్యక్రమంలో నాయకులు నెల్లూరు నిరంజన్ రెడ్డి, బండి శ్రీనివాసులు రెడ్డి, రామిశెట్టి కృష్ణ చైతన్య, అరగల రమణయ్య, విడవలూరు దశరధ రామిరెడ్డి, చంతాటి రాజశేఖర్‌బాబు, కావలి జగన్‌మోహన్‌రావు, తదితరులున్నారు.










